గుడ్ న్యూస్ : ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి వడ్ల కొనుగోళ్లు

గుడ్ న్యూస్ : ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి వడ్ల కొనుగోళ్లు
  •     75.20 లక్షల టన్నులు సేకరించాలని టార్గెట్‌‌‌‌
  •     7,149 కొనుగోలు సెంటర్లు తెరవాలని నిర్ణయం
  •     అధికారులతో సివిల్ సప్లైస్ కమిషనర్ సమావేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వచ్చే నెల1 నుంచి యాసంగి వడ్ల కొనుగోళ్లు చేపట్టేందుకు సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రెడీ అయింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ధాన్యం సేకరణకు కార్యాచరణ చేపట్టింది. శుక్రవారం సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఆధ్వర్యంలో జిల్లాల అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు, ఎఫ్‌‌‌‌సీఐ, సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌, అగ్రికల్చర్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌, వేర్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ అధికారులతో నిర్వహించిన సమావేశం లో యాసంగి ధాన్యం సేకరణ, వసతుల ఏర్పాటుపై చర్చించారు. 

ఈ సీజన్​లో 66.06 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్టు సివిల్​సప్లైస్​ అధికారులు అంచనా వేశారు. 120.91 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు అమ్మకాలు, రైతుల సొంత అవసరాలకు పోను సగం వడ్లు కొనుగోలు సెంట్లరకు వచ్చే చాన్స్​ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 75.2 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్‌‌‌‌ పెట్టుకున్నారు.

నిరుటి కంటే ఎక్కువ సెంటర్లు

యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో  7,149 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతేడాది 7,037 సెంటర్లు తెరిచి కొనుగోళ్లు చేయగా ఈసారి అదనంగా మరో 112 సెంటర్లు తెరిచేందుకు ప్లాన్​రెడీ చేశారు. ఈ సీజన్​లో అత్యధికంగా 4.11 లక్షల ఎకరాల్లో వరి సాగైన నిజామాబాద్ జిల్లాలో 466 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. సిద్దిపేట జిల్లాలో 417, జగిత్యాల జిల్లాలో 415, మెదక్ జిల్లాలో 410 సెంటర్లు ఓపెన్‌‌‌‌ చేయాలని నిర్ణయించారు. 

సెప్టెంబర్‌‌‌‌ 30 వరకు మిల్లింగ్‌‌‌‌ పూర్తి చేయాలి.. 

సేకరించిన ధాన్యం మిల్లింగ్ సెప్టెంబర్‌‌‌‌ 30 వరకు పూర్తి చేయాలని సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ చౌహన్‌‌‌‌ అధికారును ఆదేశించారు. సమయానికి సీఎంఆర్‌‌‌‌ డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాత బకాయిలు 30 లక్షల టన్నులు ఉన్నాయని, ఏండ్ల తరబడి ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. కొనుగోలు సెంటర్లలో ప్రభుత్వ సిబ్బంది మాత్రమే ఉండాలని.. రైస్‌‌‌‌ మిల్లర్లు, రేషన్‌‌‌‌ డీలర్లు, ప్రైవేటు వ్యక్తులు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరుడు 35 లక్షల టన్నుల వడ్లు టెండర్ల ద్వారా విక్రయించామని, వెంటనే వాటిని లిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.