- సవాళ్లను అధిగమించి కొనుగోళ్లు చేస్తున్నాం: డీఎస్‌వో కాశీవిశ్వనాథ్
వనపర్తి, వెలుగు: జిల్లాలో సవాళ్లను అధిగమిస్తూ వరి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌వో) కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్‌లో ఇప్పటివరకు జిల్లాలో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, మరో రెండు మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామని తెలిపారు.
ధాన్యం సేకరణలో ప్రస్తుతం వనపర్తి జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో ఉందన్నారు. యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో ఇంకా భారీ స్థాయిలో ధాన్యం సేకరణ జరగాల్సి ఉండగా, వనపర్తి జిల్లాలో మాత్రం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా ముగింపు దశకు చేరుకుందని వివరించారు. ఈసారి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లామని, జిల్లాలో తొలిసారిగా 42 గోదాములను నిల్వ కేంద్రాలుగా వినియోగించుకున్నామని చెప్పారు. డిఫాల్ట్‌గా ఉన్న మిల్లులను నిల్వ కేంద్రాలుగా మార్చి, అక్కడ పౌర సరఫరాల శాఖ సిబ్బందిని నియమించి, స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పర్యవేక్షణ చేపట్టామన్నారు.
జిల్లా పరిధిలోని 62 జెన్యూన్ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించామని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా గోదాములకు కూడా పంపిస్తున్నామని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ 77 శాతానికి చేరుకుందని, మిగిలిన 20 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయిన తర్వాత ఏ జిల్లాకు ఎంత ధాన్యం పంపించామనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.358 కోట్లను జమ చేశామని డీఎస్‌వో కాశీవిశ్వనాథ్ పేర్కొన్నారు.
