కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్..

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్..
  • రైతుల కోసం రంగంలోకి  కలెక్టర్ చిత్రామిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే 
  • కొనుగోలు కేంద్రాలకు స్వయంగా లారీలను తీసుకొచ్చిన ఎమ్మెల్యే సత్యం
  • జిల్లాలో 75 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు, ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన మిల్లులకు తరలించేందుకు లీడర్లు, అధికారులు రంగంలోకి దిగారు. కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చర్యలు చేపట్టారు.  నిత్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, కాంటా అయిన వడ్ల బస్తాలను లారీల్లో ఎక్కించి రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఆదివారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా సమీపంలో కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆపి, వాటిని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. 

మరోవైపు కలెక్టర్ సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లతో నిరంతరం సమన్వయం చేస్తూ ధాన్యం త్వరితగతిన మిల్లులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. గంగాధర మండలం గట్టుబూత్కూర్‌‌‌‌‌‌‌‌లోని జానకిరామ్ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ధాన్యం అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించి, బీహార్‌‌‌‌‌‌‌‌  కూలీలతో మాట్లాడారు. ‘రోజుకు ఎంత కూలి వస్తోంది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలు పనిచేస్తున్నారు?’  అంటూ వారి పని పరిస్థితులు, సమస్యలపై ఆరా తీశారు. 

2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు రూ.544.74 కోట్ల విలువైన 2,29,514 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.407.21 కోట్లు రైతుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేసినట్లు తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లోనే 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, జిల్లాలో సుమారు 75 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. 

మిగిలిన ధాన్యాన్ని కూడా మరో 10 రోజుల్లో కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, కొనుగోలు సంస్థలు, రైస్ మిల్లర్లు, రవాణా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 68 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

స్వయంగా లారీలను తీసుకొచ్చిన ఎమ్మెల్యే

చొప్పదండి నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం గంగాధర మండలం మధురానగర్ వద్ద కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను ఆపి, ధాన్యం మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ యజమానులను కోరారు. 

అనంతరం తానే లారీలో కూర్చుని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లారు. లారీలు లోడింగ్ అయిన వెంటనే మిల్లుల్లో అన్‌‌‌‌‌‌‌‌లోడింగ్ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.