- అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి లిఖితపూర్వక వివరణ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరిస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు లేదా సంజ్ఞలు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. తనకు కమిటీ ఇచ్చిన వీడియో కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న సెలెక్టివ్ క్లిప్ మాత్రమేనని ఆరోపించారు. మొత్తం ఘటనను చూపించే వీడియోను ఇవ్వలేదన్నారు. మార్చి 29 నాటి పూర్తి వీడియో, ఆఫ్ ద రికార్డ్ఫుటేజ్ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి ట్రెజరీ బెంచ్ వైపు ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా కడియం శ్రీహరి తనను అసభ్య పదజాలంతో దూషించారని, ఆయన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే తాను మాట్లాడానని పేర్కొన్నారు. తనపై ఆపాదించిన ప్రవర్తన రూల్ 288 పరిధిలో అనైతిక ప్రవర్తన కాదని కమిటీ తేల్చాలన్నారు. తనపై ఆరోపణలు చేసిన ఎమ్మేల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వెడ్మ బొజ్జు ఎథిక్స్ కమిటీ విచారణ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
