వడ్లు ఇంకెప్పుడు కొంటరు?

వడ్లు ఇంకెప్పుడు కొంటరు?
  • జడ్పీ మీటింగ్​లో ఆఫీసర్లను నిలదీసిన సభ్యులు
  • సాదాసీదా​గా వరంగల్​అర్బన్​ సర్వసభ్య సమావేశం

హనుమకొండ, వెలుగు :  

‘వడ్లు కొంటామని సీఎం చెప్పి 15 రోజులు దాటింది. ఇంతవరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులు కుప్పలు పోసుకుని కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నరు. వడ్లు ఇంకెప్పుడు కొంటరు?’ అని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆఫీసర్లను సభ్యులు నిలదీశారు. జడ్పీ చైర్మన్​ సుధీర్​ కుమార్​ అధ్యక్షతన వరంగల్ అర్బన్​ జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ వైస్​ చైర్మన్​ శ్రీరాములు మాట్లాడుతూ కొనుగోళ్లు స్టార్ట్​ చేయకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. ధర్మసాగర్​ జడ్పీటీసీ పిట్టల శ్రీలత మాట్లాడుతూ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం క్వాలిటీగా ఉండటం లేదన్నారు. పప్పు, చారు మరీ అధ్వానంగా పెడుతున్నారని, దీంతో పిల్లలు స్కూళ్లలో తినడం మానేసి.. ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారని అన్నారు. ఎంఈవోల కొరత తీవ్రంగా ఉందని, ఒక్కో ఎంఈవో కనీసం నాలుగైదు మండలాలకు ఇన్​ఛార్జ్​లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మన ఊరు-–మన బడి కార్యక్రమానికి ఇష్టారీతిన స్కూళ్లను సెలెక్ట్​ చేశారని, అసలు ఏ ప్రాతిపదిక ఎంపిక చేశారో చెప్పాలని ఎల్కతుర్తి ఎంపీపీ మేకల స్వప్న అడిగారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను వదిలి, కొద్దిమంది మాత్రమే ఉన్న పాఠశాలను ఎలా సెలెక్ట్​ చేశారని ప్రశ్నించారు. దీంతో జడ్పీ చైర్మన్​ సుధీర్​ కుమార్​ కల్పించుకుని వెంటనే ఎల్కతుర్తి ఎంఈవోకు ఫోన్​ చేశారు. మండలంలో ఎంపిక చేసిన స్కూళ్ల రిపోర్ట్​లు సమర్పించాలని ఆదేశించారు. ఆ తరువాత వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు ఆయా శాఖల నివేదికలు చదివి వినిపించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

లీడర్లు, ఆఫీసర్లు డుమ్మా..
జిల్లాలో ఉండే సమస్యలను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగుతోంది. వివిధ అంశాలను చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు జడ్పీ మీటింగ్​ను లైట్​ తీసుకుంటున్నారు. గురువారం నిర్వహించిన వరంగల్ అర్బన్​ మీటింగ్​కు కలెక్టర్​, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రగతి నివేదికలు చదవడం వరకే మీటింగ్​ పరిమితమైంది. 

అభివృద్ధి పనులు సమర్థవంతంగా చేపట్టాలి

జనగామ, వెలుగు : పల్లెల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్​రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని జడ్పీ ఆఫీస్​లో జడ్పీ స్టాండింగ్​ కమిటీ సమావేశాలను నిర్వహించారు. 1, 2,4,7వ స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగాయి. 3వ స్టాయి సంఘం సమావేశం జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన, 5వ స్టాయి సంఘం సమావేశం పద్మజా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 6వ స్టాయి సంఘం సమావేశం మారపాక రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ నిధులు, వినియోగం,  గ్రామాలలో చేపట్టిన పనుల పై సమీక్షించారు. అనంతరం జడ్పీ చైర్మన్​ మాట్లాడారు.  గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా విపత్కర సమయంలోనూ గ్రామాలకు ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేసిందన్నారు.