ప్రముఖ సైంటిస్ట్, పద్మ విభూషణ్ రొడ్డం నరసింహ (87) కన్నుమూత

ప్రముఖ సైంటిస్ట్, పద్మ విభూషణ్ రొడ్డం నరసింహ (87) కన్నుమూత

బెంగళూరు: ప్రముఖ ఏరో‌స్పేస్ సైంటిస్ట్, పద్మ విభూషణ్ అవార్డీ రొడ్డం నరసింహ (87) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో బాధపడుతున్న నరసింహను ఈ నెల 8వ తేదీన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ‘మా ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి నరసింహ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన మెదడు లోపల తీవ్రంగా రక్తస్రావం అయ్యింది’ అని రామయ్య మెమోరియల్ హాస్పిటల్ న్యూరోసర్జన్, సీనియర్ కన్సల్‌‌టెంట్, డాక్టర్ ఫుర్తదో చెప్పారు.

ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌‌సీ)లో 1962 నుంచి 1999 వరకు విద్యార్థులకు నరసింహ ఏరోస్సేస్ ఇంజినీరింగ్ పాఠాలను బోధించారు. 1984 నుంచి 1993 దాకా నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్‌‌కు డైరెక్టర్‌‌గా వ్యవహరించారు. అలాగే జవహర్‌‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్‌‌సీఏఎస్‌‌ఆర్)లోని ఇంజినీరింగ్ మెకానిక్స్‌ యూనిట్‌‌కు చైర్‌‌పర్సన్‌‌గానూ నరసింహ బాధ్యతలు నిర్వర్తించారు. ఇస్రో తేలికపాటి యుద్ద విమానాల (Light Combat Aircraft (LCA) నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి ఈయనే. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని అత్యున్నత సైంటిస్ట్‌గా ఎదిగారు. నరసింహ సేవలను గుర్తించిన ప్రభుత్వం.. 2013లో భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది.