AI స్కిల్స్ నేర్చుకోకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయనే హెచ్చరికలు మనం రోజూ వింటూనే ఉన్నాం. కానీ ఒక టెక్ కంపెనీ సీఈఓ దీనిని నిజం చేసి చూపించారు. ఏఐ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇప్పించినా దానిని వాడటానికి నిరాకరించినందుకు తన కంపెనీలోని ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. టెక్సాస్‌కు చెందిన ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘ఇగ్నైట్‌టెక్’ సీఈఓ ఎరిక్ వాఘన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
తన కంపెనీని ‘ఏఐ-ఫస్ట్’ ఆర్గనైజేషన్‌గా మార్చాలనేది ఎరిక్ వాఘన్ బలమైన సంకల్పం. దీనికోసం ఉద్యోగులకు భారీగా అవకాశాలు ఇచ్చారు. కంపెనీ మొత్తం పేరోల్‌లో దాదాపు 20 శాతం బడ్జెట్‌ను కేవలం ఉద్యోగుల అప్‌స్కిల్లింగ్ కోసమే కేటాయించారు. మూడు నెలల పాటు వారానికి ఒక రోజును కేవలం ఏఐ ట్రైనింగ్ కోసమే కేటాయించి, ఉద్యోగులకు జీతాలు ఇస్తూ మరీ శిక్షణ ఇప్పించారు. దీనికి తోడు ఏఐ టూల్స్ నేర్చుకునే వారికి ప్రత్యేక ఇన్సెంటివ్‌లు కూడా ఆఫర్ చేశారు.
ఇంత చేసినా సరే.. కంపెనీలోని మెజారిటీ ఉద్యోగులు ఏఐ వైపు అడుగులు వేయడానికి ఆసక్తి చూపించలేదు. తాము అంత సమయం, డబ్బు ఖర్చు చేసి ట్రైనింగ్ ఇస్తున్నా.. ‘నేను ఏఐ వాడను, నేర్చుకోను’ అని కొందరు ఉద్యోగులు మొండికేసారని ఎరిక్ ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ ఆలోచనలు కంపెనీ వ్యూహాలతో సింక్ కానప్పుడు.. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా.. ఎలాంటి స్ట్రాటజీలు వాడినా లాభం లేదని తెలుసుకున్నాడు.
►ALSO READ | హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫ్యామిలీ Vs ఇండివిడ్యువల్ మధ్య తేడాలు తెలియకపోతే నష్టపోతారు
కంపెనీ భవిష్యత్తు కోసం వేరే దారి లేక, ఏఐ వాడటానికి తిరస్కరించిన 80 శాతం మంది సిబ్బందిని తొలగించి, వారి స్థానంలో ఏఐ టెక్నాలజీపై పట్టున్న కొత్తవారిని నియమించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైనప్పటికీ తప్పలేదన్నారు సీఈఓ. ఒకవేళ తాను మళ్లీ మొదటి నుంచి ఈ ప్రాసెస్ మొదలుపెట్టాల్సి వస్తే.. ట్రైనింగ్‌లు ఇస్తూ సమయం వృథా చేయకుండా, ఏఐ నేర్చుకోనని చెప్పిన వారిని మొదటి రోజే తీసేసేవాడినని ఓపెన్‌గా చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వకపోతే ఎంతటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగమైనా రిస్క్‌లో పడుతుందని చెప్పడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్.
