వలస కూలీల విషయంలో మాకూ బాధగానే ఉంది

వలస కూలీల విషయంలో మాకూ బాధగానే ఉంది

సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా
న్యూఢిల్లీ: వలస కూలీల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా బాధపడుతోందని హోం మంత్రి అమిత్​ షా చెప్పారు. మైగ్రంట్ వర్కర్స్ స్వరాష్ట్రాలకు వెళ్లే సమయంలో, అక్కడికి చేరుకున్న తర్వాతా వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చూడటానికి శాయశక్తులా యత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా కోటి మంది ప్రజలు తమ సొంత ఇళ్లకు చేరుకున్నారని స్పష్టం చేశారు. లాక్ డౌన్ టైమ్ లో వేలాది ప్రజలు రోడ్లపై చాలా రోజులు నడుస్తూ, సురక్షితం కాని ట్రాన్స్ పోర్ట్ ద్వారా స్వస్థలాలకు చేరుకోవడంపై సర్వత్రా విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. వలస కూలీల సమస్యను సరిగ్గా పరిష్కరించడంలో మోడీ సర్కార్ విఫలమైందని వస్తున్న ఈ విమర్శలపై షా తాజాగా స్పందించారు.

‘వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితిపై మాకు కూడా బాధగానే ఉంది. దానర్థం మేం కావాల్సిన ఏర్పాట్లు చేయలేదని కాదు. సేఫ్ ట్రావెలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను చేశాం. ప్రజలు ఎవరూ ఇబ్బంది పడలేదని నేను చెప్పాలనుకోవడం లేదు. కానీ ఎవరైతే ఇబ్బందులను ఫేస్ చేశారో.. వారిపై ప్రధానితోపాటు నేను, మా పార్టీ నేతలందరం సానుభూతి తెలుపుతున్నాం. కరోనాపై మనం కలసికట్టుగా పోరాడుతున్నాం. ఐక్యంగా ఉంటే మహమ్మారిని త్వరలో అధిగమించగలం’ అని పేర్కొన్నారు. బిహార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ పై కూడా షా మాట్లాడారు. ‘బిహార్ లో మేం మంచి పొజిషన్ లో ఉన్నాం. కచ్చితంగా బెంగాల్ లో మేమే గెలుస్తాం. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బెంగాల్ రాజకీయాల్లో హింస (వయోలెన్స్) ఓ మర్యాదలా మారిపోయింది. ఆ రాష్ట్రంలో మార్పునకు ఇదే సరైన సమయమ’ని అమిత్ షా వివరించారు.