
- జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు
- ఎక్కడికక్కడ కూల్చేసిన మన బలగాలు
- నాలుగు రాష్ట్రాల్లో సైరన్ మోతలు, బ్లాకౌట్స్
- శ్రీనగర్ ఎయిర్‌పోర్టు, అవంతిపొరా ఎయిర్‌బేస్‌పై దాడిని తిప్పికొట్టిన ఆర్మీ
- పంజాబ్ ఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్ బాంబు పడి ముగ్గురికి గాయాలు
- ఎల్ఓసీ వెంట కొనసాగిన కాల్పులు, షెల్లింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. వరుసగా రెండో రోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడింది. గురువారం రాత్రి వందలాది డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించి విఫలమైన పాక్.. శుక్రవారం రాత్రి కూడా మళ్లీ డ్రోన్ దాడులతో రెచ్చగొట్టింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 26 లొకేషన్లపైకి డ్రోన్లను పంపింది. శుక్రవారం ప్రధానంగా జమ్మూకాశ్మీర్‌లోని జమ్మూ, సాంబా, రాజౌరీ సెక్టార్లు.. రాజస్థాన్‌లోని బాడ్మేర్, పోఖ్రాన్, జైసల్మేర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్సర్, ఫిరోజ్‌పూర్.. గుజరాత్ లోని భుజ్ ఏరియాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. ఆయా చోట్ల మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించగా.. వాటిని మన బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఒకవైపు బార్డర్లో భారీగా ఫైరింగ్ చేస్తూ, మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తూనే.. మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలపైకి పాక్ డ్రోన్లను పంపిందని తెలిపారు. పాక్ మళ్లీ దాడులకు తెగబడటంతో శుక్రవారం కూడా నాలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాకౌట్స్ ప్రకటించారు. లైట్లన్నీ బంద్ చేయడంతో ఆయా పట్టణాలు, నగరాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఆయా ప్రాంతాలు సైరన్ మోతలతో దద్దరిల్లాయి. జమ్మూసిటీపైకి వచ్చిన రెండు డ్రోన్లను పేల్చివేయడంతో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే సిటీ అంతటా సైరన్లు మోగించి, బ్లాకౌట్ ప్రకటించారు. జమ్మూ, పఠాన్ కోట్ సిటీల్లో వరుసగా రెండో రోజు సైరన్లు మోగాయి. శ్రీనగర్ ఎయిర్ పోర్టుపైకి, దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపొరా ఎయిర్ బేస్ పైకి దూసుకొచ్చిన డ్రోన్ లను కూడా మన బలగాలు నేలకూల్చాయి. శ్రీనగర్ లో మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అందరూ వెంటనే ఇండ్లలో లైట్లన్నీ ఆర్పివేయాలని, ఎవరూ బయటకు రావద్దంటూ ప్రకటనలు చేశారు. జమ్మూకాశ్మీర్ లోని అఖ్నూర్, ఉధంపూర్, హర్యానాలోని అంబాలా, పంచకుల ప్రాంతాలు పూర్తిగా బ్లాకౌట్ అయ్యాయి.
పంజాబ్ లో ముగ్గురికి గాయాలు..
పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ ఏరియాలో పాక్ డ్రోన్ బాంబు ఒకటి జనావాసాలపై పడటంతో ముగ్గురికి కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. శుక్రవారం అమృత్ సర్ సిటీ వైపు కూడా డ్రోన్లు రావడాన్ని పసిగట్టిన వెంటనే సైరన్ మోగించి, బ్లాకౌట్ ప్రకటించారు. ఆ తర్వాత భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజస్థాన్ లోని పోఖ్రాన్, జైసల్మేర్, బాడ్మేర్ లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే, డ్రోన్ బాంబులను మన బలగాలు పేల్చేయడం వల్లే భారీగా పేలుడు శబ్దాలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ఎల్ఓసీ వెంబడి ఉత్తరకాశ్మీర్ లోని కుప్వారా, సాంబా, పూంచ్, ఉరి, నౌగామ్, హంద్వారా సెక్టార్లపైకి పాక్ బలగాలు ఆర్టిలరీ గన్స్ తో ఫైరింగ్ చేయగా.. మన ఆర్మీ దీటుగా బదులిచ్చింది. ఎలోఓసీ వెంబడి బారాముల్లా, కుప్వారా, బందిపొరా జిల్లాల్లోని ప్రజలను బంకర్లలోకి, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పేలుడు శబ్దాలు విన్నా: ఒమర్ అబ్దుల్లా
జమ్మూలో తాను కూడా శుక్రవారం రాత్రి భారీ పేలుడు శబ్దాలు విన్నానని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ‘‘నేను కూడా భారీగా పేలుడు శబ్దాలు విన్నా. జమ్మూలో నేను ఉన్న చోటికి కొద్ది దూరంలో పెద్ద ఎత్తున ఆర్టిలరీ గన్ ఫైరింగ్ జరిగినట్టు శబ్దాలు వినిపించాయి. ప్రజలంతా ఇండ్లలోనే ఉండండి. ఎవరూ పుకార్లు నమ్మొద్దు. మనమంతా కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొందాం” అని ఆయన ట్వీట్ చేశారు. ‘‘జమ్మూలో ఇప్పుడు బ్లాకౌట్. సిటీ అంతటా సైరన్ మోతలు వినిపిస్తున్నాయి” అంటూ ఆయన చీకట్లు అలుముకున్న జమ్మూ సిటీ ఫొటోను మరో ట్వీట్లో పోస్ట్ చేశారు.