ఎర్రకోట దాడిలో ఇస్లామాబాద్ ప్రమేయం.. పాక్ నేత షాకింగ్ కామెంట్స్..

ఎర్రకోట దాడిలో ఇస్లామాబాద్ ప్రమేయం.. పాక్ నేత షాకింగ్ కామెంట్స్..

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో పాకిస్థాన్ హస్తం ఉందా అనే అనుమానాలు మళ్లీ చర్చకు దారితీశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధాని అన్వరుల్ హక్ చేసిన ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. తాము రెడ్ ఫోర్ట్‌ నుంచి కాశ్మీర్ అడవుల వరకు దాడులు చేశాం అంటూ చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అన్వరుల్ హక్‌ ఈ వ్యాఖ్యలను పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చేయటం గమనార్హం. మీరు బలోచిస్తాన్‌ను రక్తసిక్తం చేస్తే.. మేము భారత్‌ను రెడ్ ఫోర్ట్ నుంచి కాశ్మీర్ వరకు దెబ్బతీస్తాం అని అన్నారు. ఆయన ప్రకటనలోని ఈ మాటలు నేరుగా ఇటీవల పహల్గాంలో జరిగిన దాడి గురించి కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ దాడిలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నేరుగా పాల్గొన్నారు.

అయితే ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు జరిగిన విషయం వేరు. ఆ దాడికి ఉపయోగించిన కారు నడిపిన వ్యక్తి కాశ్మీరిగా గుర్తించబడగా.. అతను ఆ ఘటనలో మరణించాడు. భారత అధికారిక విచారణలో ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రమేయం నిర్ధారణ కాలేదని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దాడి జైష్-ఎ-మహమ్మద్ అనే పాక్ ఆధారిత ఉగ్రసంస్థ కార్యకలాపాలకు సంబందించిన పెద్ద కుట్రలో భాగమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ భారత్‌పై “పూర్తిస్థాయి యుద్ధం” తప్పదనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారతదేశాన్ని అస్సలు నమ్మలేం.. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ అంతర్గత రాజకీయాలు, ఉగ్రవాదంపై తాజా చర్చ స్టార్ట్ అయ్యింది.