
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు పిల్లలు సహా 10 మంది మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో ఏడు నెలల పసిపాప, నాలుగేండ్ల చిన్నారి, ఐదుగురు టీనేజర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్షియల్ క్యాపిటల్‌లోని భాటి గేట్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయని ఆయన వెల్లడించారు. అగ్నిప్రమాదం సంభవించగానే తెల్లవారుజామున 2:32 గంటలకు ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే 11 వెహికల్స్‌లో 33 మంది రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కు చేరుకొని మంటలు ఆర్పారని చెప్పారు. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఈ ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు.