మా సోల్జర్లు 11 మంది చనిపోయారు..అధికారికంగా ప్రకటించిన పాకిస్తాన్

మా సోల్జర్లు 11 మంది చనిపోయారు..అధికారికంగా ప్రకటించిన పాకిస్తాన్
  • మరో 78 మంది సైనికులకు గాయాలు

ఇస్లామాబాద్: ‘ఆపరేషన్​సిందూర్​’లో భాగంగా భారత్​ నిర్వహించిన ప్రతీకార దాడిలో తమకు వాటిల్లిన నష్టంపై పాకిస్తాన్ స్పందించింది. ఓ స్క్వాడ్రన్​లీడర్​సహా 11 మంది సైనికులు చనిపోయారని, 78 మంది గాయపడ్డారని తెలిపింది. అదేవిధంగా 40 మంది పౌరులు చనిపోగా 121 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇందులో 15 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారని వివరించింది. ఈమేరకు మంగళవారం  ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్‌‌‌‌పీఆర్‌‌‌‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

పాకిస్తాన్‌‌‌‌ ఎయిర్ ఫోర్స్​కు చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందారని, వీరిలో స్క్వాడ్రన్‌‌‌‌ లీడర్‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌ యూసఫ్‌‌‌‌, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ఉన్నారని తెలిపింది. అలాగే, పాకిస్తాన్ సాయుధ దళాలు ‘మర్కా- ఎ -హక్’  ఆపరేషన్​ కింద ప్రతిస్పందించాయని, ‘ఆపరేషన్ బున్యానుమ్ మర్సూస్’ ద్వారా భారత్​పై కచ్చితమైన, తీవ్రమైన ప్రతీకార దాడులు చేశాయని తెలిపింది.

భారత్​ దాడిలో మృతిచెందిన సైనికులు, పౌరులకు సాయుధ దళాలతో పాటు దేశ ప్రజలు నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నది. పాకిస్తాన్​ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొంటామని తెలిపింది. కాగా, భారత్‌‌‌‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైందని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో  పాక్‌‌‌‌ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ షరీఫ్‌‌‌‌ చౌధరీ తెలిపారు.