
- మిలిటరీకి కూడా భారీ నష్టం జరిగింది: పాక్ ఆర్మీ ప్రతినిధి
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ లో తమ ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసిన విషయం నిజమేనని పాకిస్తాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారు. భారత బలగాలు మొత్తం 11 ఎయిర్ బేస్ లపై అటాక్ చేశాయని ఆయన అంగీకరించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే, భారత్‌తో పోరులో తమ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి డ్యామేజ్ అయిందని పాకిస్తాన్ మిలిటరీ కూడా ఒప్పుకుంది. అయితే, డ్యామేజ్ అయిన యుద్ధ విమానం పేరును వెల్లడించలేదు. తమ దేశ నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధ్రి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
భారత బలగాల దాడిలో ఒక్క ఎయిర్ క్రాఫ్ట్‌కు మాత్రమే డ్యామేజ్ జరిగిందని ఆయన చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్న ఆ జెట్ ఫైటర్‌ను భారత బలగాలు కూల్చివేశాయన్నారు. తమ కస్టడీలో ఏ ఇండియన్ పైలట్ కూడా లేరని తెలిపారు. భారత్ తో పోరులో తమ దేశ మిలిటరీకి భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దేశ రాజధాని ఇస్లామాబాద్ కు సమీపంలో మిలిటరీ స్థావరాలతో పాటు పలు కీలక స్థావరాలను భారత్ దెబ్బతీసిందని వివరించారు.