Pakistan Cricket: తప్పుకున్న షాహీన్ అఫ్రిది.. పాకిస్తాన్ కెప్టెన్‌‌గా మళ్లీ బాబర్‌ ఆజం

Pakistan Cricket: తప్పుకున్న షాహీన్ అఫ్రిది.. పాకిస్తాన్ కెప్టెన్‌‌గా మళ్లీ బాబర్‌ ఆజం

గత వారం రోజులుగా పాకిస్తాన్ క్రికెట్‌ను కుదిపేస్తున్న కెప్టెన్సీ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. షాహీన్ షా అఫ్రిది తనకు తానుగా టీ20 కెప్టెన్సీ వదులుకోవడంతో.. పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాబర్‌ ఆజం మళ్ళీ బాధ్యతలు అందుకున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) అధికారిక ప్రకటన చేసింది. సెలక్షన్‌ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడంతో బాబర్‌ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది.

వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ జట్టు పేలవ ప్రదర్శన అనంతరం పాక్‌ క్రికెట్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విదేశీ కోచ్‌లను తప్పించడంతో పాటు కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజంను తప్పుకోవాలని సూచించారు. పీసీబీ పెద్దలు సైతం అదే చెప్పడంతో బాబర్‌ తప్పుకోక తప్పలేదు. అతని స్థానంలో టీ20 బాధ్యతలు ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టు పగ్గాలు షాన్‌ మసూద్‌కు అప్పగించారు.

ఇద్దరూ ఇద్దరే

షాన్‌ మసూద్‌ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్‌.. కంగారూల చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. టెస్టు సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. అనంతరం షాహిన్‌ అఫ్రిది నాయకత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్.. టీ20 సిరీస్‌లోను 4-1తో కోల్పోయింది. దీంతో పీసీబీ పెద్దలకు మరోసారి బాబర్ ఆజామే పెద్ద దిక్కుగా కనిపించాడు.

ప్రస్తుతానికి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే బాబర్ ఆజాం కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. టెస్టులకు షాన్‌ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నారు. ఏప్రిల్‌ 18 నుంచి స్వదేశంలో పాకిస్తాన్‌ జట్టు.. న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్‌ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.