Shaheen Afridi: మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు: రిజ్వాన్‌పై వేటు.. పాకిస్థాన్ కొత్త వన్డే కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది

Shaheen Afridi: మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు: రిజ్వాన్‌పై వేటు.. పాకిస్థాన్ కొత్త వన్డే కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది

పాకిస్థాన్ క్రికెట్ రోజురోజుకీ దిగజారుతూ వస్తోంది. ఆ జట్టు పసికూన జట్లపై గెలవలేక నానా తంటాలు పడుతుంది. కనీసం సొంతగడ్డపై సిరీస్ గెలవలేక ఆపసోపాలు పడుతుంది. ఫార్మాట్ ఏదైనా పరాజయాలు ఆ జట్టును పలకరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వన్డేల్లో పాక్ గెలుపు రుచి చూడక చాలా నెలలు కావొస్తుంది. సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక విజయం కూడా లేకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మహమ్మద్ రిజ్వాన్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిదిని కొత్త వన్డే కెప్టెన్ గా నియమించింది. 

షహీన్ అఫ్రిది పాకిస్థాన్ కొత్త వన్డే కెప్టెన్ గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం (అక్టోబర్ 20) అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్ గా అఫ్రిదికి ఇదే తొలి సిరీస్. రిజ్వాన్ తొలగింపుకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి ఎలాంటి కారణం చెప్పలేదు. పాకిస్థాన్ తాము ఆడిన చివరి 9 వన్డేల్లో కేవలం ఒకటి మాత్రమే గెలవడం ఇందుకు కారణం అని తెలుస్తుంది. వాస్తవానికి రిజ్వాన్ కెప్టెన్సీ ప్రారంభంలో పాకిస్థాన్ గొప్పగా ఆరంభించింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికాలో వరుసగా సిరీస్ లు గెలుచుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు నుంచి ఈ వికెట్ కీపర్ కెప్టెన్సీలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమవుతూ వచ్చింది. 

ఓవరాల్ గా రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ ఆడిన 20 మ్యాచ్‌ల్లో కేవలం తొమ్మిది మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. మెన్ ఇన్ గ్రీన్ జట్టు ఇప్పుడు అఫ్రిది నాయకత్వంలో ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది. వన్డేల్లో కెప్టెన్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి అయినా పాకిస్థాన్ టీ20 జట్టుకు ఈ పేసర్ కెప్టెన్సీ చేశాడు. 2024 ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ 1-4 తేడాతో కోల్పోయింది. సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ నుంచి అఫ్రిది వన్డే కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. టెస్టుల్లో షాన్ మసూద్.. టీ20 సల్మాన్ అలీ అఘా కెప్టెన్ లుగా కొనసాగుతున్నారు.