కాపీ పేస్ట్ పాకిస్థాన్: విదేశాలకు పాక్ డెలిగేషన్ ​బృందం

కాపీ పేస్ట్ పాకిస్థాన్: విదేశాలకు పాక్ డెలిగేషన్ ​బృందం

ఇస్లామాబాద్: ఆపరేషన్​సిందూర్​తర్వాత భారత్​ఏం చేస్తే పాకిస్తాన్​అదే చేస్తున్నది. టెర్రరిజంపై తమ పోరాటాన్ని, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ఏడుగురు ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్​కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నది. 

శాంతి రాయబారుల పేరుతో తమ ఎంపీల బృందాన్ని విదేశాలకు పంపించనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్​షరీఫ్​ ఆదివారం ప్రకటించారు. మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీతో ఫోన్‌‌లో మాట్లాడిన తర్వాత శనివారం ప్రధాని షెహబాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రతినిధి బృందానికి బిలావల్​ భుట్టో నేతృత్వం వహిస్తారని పేర్కొన్నది. 

కాగా, దీనిపై బిలావల్​ భుట్టో ఎక్స్​ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ గొంతుక వినిపించే అవకాశం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు అప్పగించారని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని తనతో సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. ఈ బాధ్యతను స్వీకరించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశసేవకోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.