
- ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్య
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. తన వంకరబుద్ధిని చాటుకున్నది. జమ్మూకాశ్మీర్ లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి డ్రోన్లతో దాడులకు యత్నించింది. దీన్ని మన సైన్యం తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే కూల్చేసింది. రాత్రి పూట ఆకాశంలో మన దేశం వైపు డ్రోన్లు రావడాన్ని గమనించామని, వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేసి నేలమట్టం చేశామని ఆఫీసర్లు చెప్పారు. సాంబాతో పాటు సమీపంలోని పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు.
కాల్పుల విరమణకు ఒప్పుకున్న రోజే (ఈ నెల 10న) రాత్రి దాడులకు యత్నించిన పాకిస్తాన్.. ఆదివారం మాత్రం సైలెంట్ అయింది. తిరిగి సోమవారం రాత్రి తన బరితెగింపును ప్రదర్శించింది. అయితే.. రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ఇలా డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా.. వాటిని మన సైన్యం తునాతునకలు చేసింది.