జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇంతకీ ఏమిటీ కేసు?

జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇంతకీ ఏమిటీ కేసు?

ఇస్లామాబాద్:     పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ కటకటాలపాలయ్యారు. విదేశీ పర్యటనల్లో అధికారికంగా వచ్చిన ఖరీదైన గిఫ్ట్ లను అమ్ముకున్నట్లు నమోదైన తోషాఖానా కేసులో ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో ఇమ్రాన్​ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్​లోని డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి శనివారం.. మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ పై ఐదేండ్లు నిషేధం విధించారు. దీంతోపాటు రూ. లక్ష జరిమానా వేశారు. కోర్టు తీర్పు ప్రకటించిన సమయంలో ఇమ్రాన్ లాహోర్​లోని జమానా పార్క్ రోడ్డులోని తన నివాసంలో ఉన్నారు. తీర్పు వచ్చిన వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి భారీ భద్రత మధ్య ఇస్లామాబాద్ తరలించారు. 

ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్​లోని లాహోర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ఇంటి వద్ద నిరసనకు దిగిన పీటీఐ కార్యకర్తలను చెదరగొట్టామని  పంజాబ్ ప్రావిన్స్ మంత్రి ఒకరు తెలిపారు. మే 9న అల్ ఖాదిర్ ట్రస్ట్ కరప్షన్ కేసులోనూ ఇమ్రాన్ అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలయ్యారు. అప్పుడు అరెస్ట్ సందర్భంగా దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సారి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఇమ్రాన్​ను జైలుకు తరలించారని మీడియా వెల్లడించింది. తీర్పు సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తరఫున సీనియర్ అడ్వకేట్ సైతం కోర్టుకు రాలేదు. ఇమ్రాన్ తరఫు సీనియర్ అడ్వకేట్ కోసం వేచి చూసిన జడ్జి.. చివరకు మధ్యాహ్నం తీర్పును ప్రకటించారు.  

ఏమిటీ కేసు? 

తోషాఖానా అంటే పాక్ కేంద్ర ప్రభుత్వంలోని ఒక డిపార్ట్ మెంట్. దేశ ప్రధానికి, మంత్రులకు, బ్యూరోక్రాట్లకు విదేశీ ప్రభుత్వాల నుంచి, వ్యక్తుల నుంచి అధికారికంగా అందే గిఫ్ట్ లను ఈ డిపార్ట్ మెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2018 నుంచి 2022 మధ్య విదేశీ పర్యటనల్లో రూ. 14 కోట్లకుపైగా విలువైన గిఫ్ట్ లు అందుకున్నారు. వీటిలో రూ. 9.6 కోట్ల విలువైన 7 రిస్ట్ వాచ్ లను రూ. 2.10 కోట్లకు కొనుగోలు చేశారని, వాటిని ఎక్కువ ధరకు అమ్ముకున్నారని.. ఈ విషయాన్ని దాచి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్ స్పీకర్ ఫిర్యాదు మేరకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం 2022, అక్టోబర్ 21న ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసింది. ఆ తర్వాత ఇమ్రాన్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో శనివారం డిస్ట్రిక్ట్ అడిషనల్ సెషన్స్ జడ్జి హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు.  

అందరు ప్రధానులూ అంతే.. 

విదేశాల్లో అందిన గిఫ్ట్​లను పాక్ ప్రధానులు కొంత మొత్తం చెల్లించి తోషాఖానా నుంచి కొనుక్కోవడం అధికారికమే. ప్రధానులుగా పని చేసినవాళ్లంతా దిగిపోయేటప్పుడు అలా ఖరీదైన గిఫ్ట్​లను చౌకగా కొని తీసుకెళ్లినవాళ్లే. పాకిస్తాన్​లో ప్రధానులు, మంత్రులు,  మిలిటరీ ఆఫీసర్లు కూడా అఫీషియల్ గిఫ్ట్ లను చాలా ఇష్టపడుతుంటారు. లగ్జరీ వాచ్ లు, జ్యువెల్లరీ, లగ్జరీ కార్లు, వెపన్స్ వంటివీ ఇందులో ఉంటాయి. అయితే, గిఫ్ట్ లను కొని, అమ్మిన విషయం ఎన్నికల అఫిడవిట్​లో దాచడం వల్లే  ఇమ్రాన్ జైలుపాలయ్యారు. 

ఇమ్రాన్​పై మరో 200 కేసులు 

2018 నాటి ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్​లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. రష్యా, చైనా, అఫ్గానిస్తాన్ విషయంలో స్వతంత్ర విదేశీ విధానాన్ని పాటించడం వల్లే అమెరికా ఆధ్వర్యంలో తన సర్కారును కూల్చేందుకు కుట్ర జరిగిందని ఇమ్రాన్ అప్పట్లో ఆరోపించారు. పదవి నుంచి దిగిపోయాక ఇప్పటివరకు ఇమ్రాన్​పై దేశంలో 200 దాకా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింస, దైవదూషణ, హత్య, టెర్రరిజం వంటి ఆరోపణలతో ఈ కేసులు ఫైల్ అయ్యాయి. 

పార్లమెంట్ రద్దుకు రంగం సిద్ధం

పాకిస్తాన్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) ప్రస్తుత టర్మ్ ఈ నెల 12న ముగియనుంది. ఆ తర్వాత పార్లమెంట్ ఆటోమేటిక్​గా రద్దవుతుంది. ఆపై ప్రెసిడెంట్ కేర్ టేకర్ ప్రధానిని నియమిస్తారు. అనంతరం 60 రోజులలోపు ఎన్నికలు జరగాలి. గడువు కన్నా ముందే పార్లమెంట్​ను రద్దు చేస్తే.. 90 రోజుల సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న పార్లమెంట్​ను రద్దు చేయాలని కోరేం దుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిద్దమవుతున్నా రు. కేర్ టేకర్ ప్రధానిగా ఎవరి పేరును సిఫారసు చేయాలన్న విషయంపై ఆయన శనివారం మిత్రపక్షాల నేతలతో సమావేశమయ్యారు.