
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తోషాఖానా కేసులో జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను శనివారం దాకా సస్పెండ్ చేస్తూ తీర్పు వెల్లడించింది. లాహోర్ హైకోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అతిథులు ఇచ్చిన కానుకలను అమ్మేసుకున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారని ఇస్లామాబాద్ హైకోర్టు తెలిపింది. విచారణకు పిలిచినా హాజరుకాలేదని, అందుకే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారని ప్రకటించింది. శనివారం కచ్చితంగా లాహోర్ హైకోర్టులో విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను అమలు చేసే విషయంతో పాటు ఇమ్రాన్ ఖాన్ భద్రతపైన పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్‌తో పీటీఐ హైకమాండ్ మరోసారి సమావేశం కావాలని ఇస్లామాబాద్ కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చినప్పుడు పీటీఐ కార్యకర్తలు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారీ భద్రత మధ్య లాహోర్ హైకోర్టుకు..
అరెస్ట్ వారెంట్ కొట్టేయడంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జమాన్ పార్క్‌లోని ఆయన ఇంటి ముందు ఉంచిన బారికేడ్లను శుక్రవారం తొలగించారు. అడ్డంగా పెట్టిన కంటైనర్స్ తీసేశారు. గొడవల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ టైం శుక్రవారం ఇంటి నుంచి బయటికొచ్చారు. పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీగా లాహోర్ హైకోర్టుకు వెళ్లారు. తనపై నమోదైన 9 కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇమ్రాన్‌పై టెర్రరిజం ఆరోపణలతో పాటు మొత్తం నాలుగు కేసుల ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించింది. మిగిలిన ఐదు కేసుల పిటిషన్లను జస్టిస్ షేక్‌తో కూడిన సింగిల్ మెంబర్ బెంచ్ విచారణ చేపట్టింది. దీనికి ముందు ఇమ్రాన్‌ఖాన్ లాహోర్ హైకోర్టు వచ్చేందుకు భద్రత కల్పించాలని పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్‌ను జడ్జి ఆదేశించారు.