మానవత్వానికి పాక్ ముప్పు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

మానవత్వానికి పాక్ ముప్పు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్: పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ, మానవత్వానికి ముప్పుగా మారిందన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్తానని ఎంఐఎం చీఫ్, అఖిలపక్ష ఎంపీల బృందం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం ఆయన ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘సుదీర్ఘకాలంగా టెర్రిరస్టులను ఎగదోస్తూ అమాయక పౌరులను పాకిస్తాన్ ఊచకోత కోయిస్తోందని ప్రపంచానికి చెప్తాను. 

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ అతిపెద్ద బాధిత దేశం. జియా ఉల్ హక్ కాలం నుంచీ భారత ప్రజలను ఊచకోత కోస్తూ, నరమేధానికి పాల్పడుతుంటే మనమంతా తమాషా చూశాం. భారత్ ను అస్థిరపర్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ, మిలిటరీ ప్రయత్నాలు కొనసాగించినంత కాలం ఆ దేశాన్ని నమ్మరాదు” అని ఆయన ఫైర్ అయ్యారు. 

‘‘రాజకీయంగా, సిద్ధాంతపరంగా మేం బీజేపీపై పోరాడుతాం. కానీ దేశం విషయం వస్తే, అమాయక పౌరులను చంపేస్తుంటే.. ఈ రాజకీయ, సిద్ధాంతపరమైన భేదాలను పక్కనపెట్టి ఏకమవుతాం” అని అసదుద్దీన్ స్పష్టం చేశారు. దేశంలోని ముస్లింల అభిప్రాయం కూడా ఇదేనని చెప్పారు. తాను తన పార్టీ తరఫున మాట్లాడుతున్నానని, కానీ ఆ పార్టీ ఇండియన్ ముస్లింలతోనే ఏర్పాటైందన్నారు. దేశం విషయానికి వస్తే ఇక్కడ మతపరమైన ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. 

‘‘మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్న భారతీయ పౌరులం. మనలో ఏ ఒక్కరు పడవకు రంధ్రం చేసినా.. అందరమూ మునిగిపోతాం. మనల్ని ఎవరూ కాపాడలేరు. అందుకే ప్రతి తుఫాన్​ను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఆ తర్వాత మనలో మనకు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవాలి” అని ఆయన అన్నారు. భారతదేశాన్ని అస్థిరపర్చడం, మతపరంగా విడిపోయేలా చేయడం, ఆర్థిక ప్రగతిని స్తంభింపచేయడమే పాకిస్తాన్, ఆ దేశ మిలిటరీ అనుసరిస్తున్న అలిఖిత సిద్ధాంతంమని అసదుద్దీన్ మండిపడ్డారు.