మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్?

మళ్లీ సైన్యం చేతుల్లోకి పాక్?

తగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ ఇమేజ్..
పాలనపై పట్టు బిగిస్తున్న ఆర్మీ ఆఫీసర్లు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మళ్లీ సైన్యం చేతుల్లోకి నెమ్మదిగా జారుకుంటోందా? దాయాది దేశం మళ్లీ ఆర్మీ జనరళ్ల పాలన దిశగా అడుగులు వేస్తోందా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆ దేశంలో దాదాపు డజనుకు పైగా ఆర్మీ ఆఫీసర్లు పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ లో కరోనాను హ్యాండిల్ చేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తో సహా ఆ దేశ జాతీయ ఎయిర్ లైన్స్, పవర్ రెగ్యులేటర్ సంస్థ వంటివి పూర్తిగా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. గత రెండు నెలల్లోనే ఇలాంటివి మూడు నియామకాలు జరిగాయి. దీంతో పాకిస్తాన్ మళ్లీ సైనిక పాలనలోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయని అంటున్నారు .

తగ్గుతున్న ఇమ్రాన్ పాపులారిటీ..
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ క్రమంగా తగ్గుతోందని విశ్లేషకులు చెప్తున్నారు . దేశ ఎకానమీ పతనం అవుతుండటం, ధరలు విపరీతంగా పెరగడం, పీఎం అనుచరుల్లో ఎక్కువ మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం వంటి కారణాల వల్ల ఇమ్రాన్ ఇన్ ఫ్లుయెన్స్ తగ్గుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆర్మీ సపోర్ట్ కీలకంగా ఉంది. పార్లమెంటులో 46 శాతం సీట్లు ఆర్మీ గుప్పిట్లోనే ఉండటాన్నీ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పాకిస్తాన్ తన 70 ఏళ్ల చరిత్రలో ఎక్కువ సార్లు సైనిక పాలనలోనే మగ్గింది. కొత్త పాకిస్తాన్ ను సాధిస్తానని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఆ లక్ష్యం చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు.

ఆర్మీ ఆఫీసర్లదే కీరోల్..
కరోనాపరిస్థితిపై మీడియా సమావేశాల్లో పలువురు ఆర్మీ ఆఫీసర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానికి కమ్యూనికేషన్ అడ్వైజర్ గా పని చేస్తున్న రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ బజ్వా.. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ లో అన్నీ తానై నడిపిస్తున్నాడు. పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించిన 12 మంది ఆర్మీ మద్దతుదారులు ఇప్పుడు ఇమ్రాన్ ప్రభుత్వంలోనూ కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ‘ఆర్మీ లీడర్‌షిప్ మెజారిటీగా మారితే, వ్యవస్థ మరింత బాగుంటుంది’ అంటూ ఈ మధ్యనే జైఘామ్ రిజ్వీ అనే లీడర్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఆయన కామెంట్లను ఆర్మీ ఖండించింది. మొత్తంగా ప్రస్తుత, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, ఆర్మీ మద్దతు ఉన్న నేతల కారణంగా ఇమ్రాన్ ఖాన్ పవర్ క్రమంగా తగ్గుతోందని న్యూయార్క్ కు చెందిన వీజిర్ కన్సల్టింగ్ ప్రెసిడెంట్ ఆరిఫ్ రఫీక్ అంటున్నారు. పాక్ లో ఎకానమీ సవాళ్లు మరింతగా పెరిగితే ఆయనపై మరింత ఒత్తిడి వస్తుందన్నారు. కరోనాను ఇమ్రాన్ హ్యాండిల్ చేస్తున్న తీరుపై ఆర్మీ ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తోందని ఆయన అన్నారు. గత ఏడాది దేశ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే చర్యల కోసం.. ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వా వ్యాపారులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత నుంచి ఆయా అంశాల్లో మిలటరీ జోక్యం పెరిగిందని భావిస్తున్నారు.

For More News..

ఏనుగులకు 5 కోట్ల ఆస్తి రాసిచ్చిన జంతు ప్రేమికుడు

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్

జనాలకే కరోనా రూల్స్.. లీడర్లకు కాదు..