
అమృత్‌సర్: బార్డర్ క్రాస్ చేశాడనే కారణంతో గత నెలలో అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్ జవాన్‌ను పాకిస్తాన్ విడుదల చేసింది. అలాగే బార్డర్‌లో మన ఆర్మీ అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్‌ను మన దేశం తిరిగి అప్పగించింది. బుధవారం పంజాబ్ అమృత్‌సర్‌లోని వాఘా, అటారీ బార్డర్ వద్ద జవాన్ల అప్పగింత ప్రశాంతంగా జరిగింది.
బెంగాల్‌కు చెందిన పూర్ణం కుమార్ షా.. బీఎస్‌ఎఫ్ 24వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. గత నెల 23న ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో డ్యూటీ చేస్తున్న టైమ్‌లో పొరపాటున బార్డర్ దాటారు. దీంతో పాకిస్తాన్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షాను తిరిగి రప్పించడం కోసం ఆర్మీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు.