
ఇస్లామాబాద్: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత్ చేసిన వైమానిక దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని పాకిస్తాన్ దేశం ప్రకటించుకుంది. 78 మంది గాయపడ్డారని చెప్పుకొచ్చింది. చనిపోయిన 11 మంది పాక్ సైనికుల్లో ఆరుగురు ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సైనికులుగా పాక్ ఆర్మీ పేర్కొంది. 11 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ISPR వెల్లడించింది. చనిపోయిన సైనికుల వివరాలను పేర్లతో సహా ప్రకటించింది.
చనిపోయిన పాకిస్తాన్ సైనికుల వివరాలు(పాకిస్తాన్ ఆర్మీ):
* నాయక్ అబ్దుల్ రెహమాన్
* లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్
* లాన్స్ నాయక్ ఇక్రముల్లా
* నాయక్ వకార్ ఖలీద్
* సెపాయ్ ముహమ్మద్ అదీల్ అక్బర్
* సెపాయ్ నిసార్
చనిపోయిన పాకిస్తాన్ సైనికుల వివరాలు(పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్):
* స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్
* చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్
* సీనియర్ టెక్నీషియన్ నజీబ్
* కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్
* సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్
ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన సైనికులు కేవలం 11 మంది మాత్రమేనని పాక్ చెప్పింది. కానీ ఇండియా మాత్రం కనీసం 35 నుంచి 40 మంది చనిపోయారని సోమవారం (మే 12) ప్రకటించింది. సోమవారం జరిగిన త్రివిధ దళాధిపతుల సమావేశంలో మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన దాడుల్లో.. లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో పాక్ తీవ్రంగా నష్టపోయిందని ప్రకటించిన విషయం తెలిసిందే.
అదే విధంగా ఆపరేషన్ సిందూర్ లో భారత్ కు జరిగిన నష్టాన్ని డీజీఎమ్ఓ ల సమావేశంలో తెలిపారు. పాక్ దాడుల్లో 5 మంది భారత సైనికులను కోల్పోయినట్లు ఆర్మీ ప్రకటించింది.