
- 36 నగరాలపై దాడిని దీటుగా తిప్పికొట్టినం: రక్షణ శాఖ
- 4 ఎయిర్‌పోర్టులే లక్ష్యంగా పాకిస్తాన్ అటాక్
- ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతున్న దాయాది
- కరాచీ, లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగుతన్నయ్
- పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్
- బ్రీఫింగ్ ఇచ్చిన రక్షణ శాఖ ప్రతినిధులు
న్యూఢిల్లీ: ఇండియాపై పాకిస్తాన్ గురువారం అర్ధరాత్రి దాటాక డ్రోన్లతో దాడి చేసిందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. మొత్తం 300 నుంచి 400 డ్రోన్లు వాడిందని వివరించింది. టర్కీలో తయారైన ఈ డ్రోన్లన్నింటినీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, శ్రీనగర్ నుంచి జైసెల్మేర్, పఠాన్‌కోట్ లక్ష్యంగా దాడులకు తెగబడిందని వివరించింది. 4 ఎయిర్‌పోర్టులను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్అప్డేట్లను విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలు సంయుక్తంగా బ్రీఫింగ్ ఇచ్చాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇండియన్ మిలటరీ స్థావరాలతో పాటు మొత్తం 36 నగరాలపై డ్రోన్లు ప్రయోగించిందని వివరించారు.
ఇండియా సంయమనంతో వ్యవహరించింది
పాకిస్తాన్ తన ఎయిర్‌స్పేస్‌ను క్లోజ్ చేయలేదని రక్షణ శాఖ ప్రతినిధులు వివరించారు. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయన్నారు. తమ దాడులకు ఇండియా నుంచి కౌంటర్ అటాక్ ఉంటుందని తెలిసీ.. పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటున్నదని మండిపడ్డారు. ఇది అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి ప్యాసింజర్ ఫ్లైట్లకు సేఫ్ కాదన్నారు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని ఐఏఎఫ్ సంయమనంతో వ్యవహరించిందన్నారు.
డ్రోన్లకు కెమెరాలు అమర్చి పంపిన్రు..
‘‘లడఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్‌తో పాటు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోనూ పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయి. సుమారు 50 డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూల్చేశాయి. మరో 20 డ్రోన్లను జామింగ్ రేడియో ఫ్రీక్వెన్సీతో న్యూట్రలైజ్ చేశాం. చాలా వరకు డ్రోన్లు అన్ ఆర్మ్డ్గానే ఉన్నాయి. ఇండియా రక్షణ వ్యవస్థను పరీక్షించేందుకే పాకిస్తాన్ సాధారణ డ్రోన్లను ప్రయోగించి ఉండొచ్చు. అన్ని డ్రోన్లకు కెమెరాలను అమర్చారు. వాటి ఫుటేజ్ మొత్తం పాకిస్తాన్‌లోని గ్రౌండ్ స్టేషన్లో చూసేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది’’అని కేంద్రం తెలిపింది.
సీజ్ఫైర్ నిబంధనకు పాక్ తూట్లు
ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలను టెస్ట్ చేయడం, సమాచార సేకరణే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడినట్లు రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ‘‘ప్రాథమిక నివేదికల ప్రకారం టర్కీకి చెందిన ‘ఆసిస్‌గార్డ్ సోంగర్’ డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. ఎల్వోసీ వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నది. భారీ మోర్టార్ షెల్స్‌తో కాల్పులు జరుపుతున్నది. ఇండియా చేసిన కౌంటర్ అటాక్‌లో పాకిస్తాన్‌కు భారీ నష్టం జరిగింది. దాడులపై ప్రపంచ దేశాలను తప్పుదారి పట్టిస్తున్నది. పూంచ్‌లో గురుద్వారాపై కూడా పాక్ దాడి చేసింది’’అని వివరించారు.
పాక్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేశాం
ఇండియాలో మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నదని రక్షణ శాఖ ప్రతినిధులు వివరించారు. ‘‘పంజాబ్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్నాం. పాకిస్తాన్ జరిపిన దాడుల్లో 16 మంది చనిపోయారు. వారిలో ఓ జవాన్ కూడా ఉన్నాడు. అనేకమంది సాధారణ ప్రజలు గాయపడ్డారు. పాకిస్తాన్ దాడులను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సమర్థంగా అడ్డుకున్నది. పాక్ ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్స్‌ను ధ్వంసం చేశాం. పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి.. కూలిపోయిన డ్రోన్లు, మిసైళ్ల పార్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని వివరించారు.