Asia Cup 2025 Final: పాక్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. భారీ స్కోర్ అందుకుంటే స్వల్ప స్కోర్‌కే పరిమితం

Asia Cup 2025 Final: పాక్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. భారీ స్కోర్ అందుకుంటే స్వల్ప స్కోర్‌కే పరిమితం

పాకిస్థాన్ తో జరుగుతున్న ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా బౌలర్లు తడబడి పుంజుకున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ తుది సమరంలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి పాక్ జట్టును ఒక మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫఖర్ జమాన్ (46) తప్ప మిగిలిన వారందరూ విఫలం కావడంతో పాకిస్థాన్ నిర్ణీత 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ పాకిస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 9.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ అందించారు. వీరిద్దరి జోడీ జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లే లో పాక్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్లపై ఆధిపత్యం చూపించిన ఈ జోడీ వేగంగా ఆడుతూ వికెట్ కాపాడుకుంటూ వచ్చింది. వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్ (57) ను ఔట్ చేసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు.

►ALSO READ | Asia Cup 2025 final: పాండ్య స్థానంలో రింకూకి ఛాన్స్ అవసరమా.. టీమిండియాకు ఐదో బౌలర్ తిప్పలు

ఆ తర్వాత సైమ్ అయూబ్ తో కలిసి ఫకర్ జమాన్ 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. అయితే పాక్ ఒక పరుగు వ్యవధిలో అయూబ్ (14) తో పాటు మహమ్మద్ హారీస్ వికెట్ (0) కోల్పోయింది. 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పర్వాలేదనిపించిన పాక్.. ఊహించని విధంగా వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు విజృంభించడంతో కేవలం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో పాకిస్థాన్ 150 పరుగుల మార్క్ కూడా అందుకోలేకపోయింది. టాపార్డర్ మినహాయిస్తే మిగిలిన పాక్ బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు.