హ్యాంగర్లు ధ్వంసం.. రన్​వేలపై భారీ గుంతలు..భారత బలగాల దాడుల్లో పాక్​కు భారీ నష్టం

హ్యాంగర్లు ధ్వంసం.. రన్​వేలపై భారీ గుంతలు..భారత బలగాల దాడుల్లో పాక్​కు భారీ నష్టం
  • రావల్పిండి, సింధ్, పంజాబ్ లోని మిలిటరీ స్థావరాలు కూడా తునాతునకలు
  • ఆపరేషన్  సిందూర్  స్ట్రైక్స్  శాటిలైట్  ఫొటోలు విడుదల 
  • శత్రు దేశానికి వెన్నులో వణుకు పుట్టించిన ఫోర్సెస్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్  అటాక్ కు ప్రతీకారంగా భారత్  చేపట్టిన ఆపరేషన్  ‘సిందూర్’ పాకిస్తాన్​కు వెన్నులో వణుకు పుట్టించింది. మన దేశంపై అదేపనిగా టెర్రరిస్టులను ఉసిగొల్పుతున్న శత్రు దేశానికి భారత బలగాలు దీటైన జవాబు చెప్పాయి. ఆపరేషన్  సిందూర్ లో భాగంగా నిర్వహించిన ప్రతిదాడుల్లో పాక్ విమానాశ్రయాలలోని హ్యాంగర్లు (విమానాలను పార్క్ చేసే ప్రదేశం) ధ్వంసమయ్యాయి. రన్ వేలపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. 

రావల్పిండి, సింధ్, పంజాబ్ లోని మిలిటరీ స్థావరాలను కూడా భారత బలగాలు తునాతునకలు చేశాయి. భారత బలగాల ప్రతిదాడుల్లో పాక్ లో జరిగిన విధ్వంసానికి సంబంధించిన శాటిలైట్  ఫొటోలను మంగళవారం పలు టీవీ చానెళ్లు విడుదల చేశాయి. అమెరికాకు చెందిన ఏరోస్పేస్  సంస్థ మ్యాక్సర్  టెక్నాలజీస్  సాయంతో ఈ ఫొటోలను రిలీజ్  చేశాయి. మ్యాక్సర్  టెక్నాలజీస్   హైరెజల్యూషన్ తో ఈ శాటిలైట్  పిక్స్ ను విడుదల చేసింది. 

అమాయకులు నష్టపోకుండా బదులిచ్చిన బలగాలు

గత నెల 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది అమాయక ప్రజలను టెర్రరిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులు చేశాయి. తొలుత పాకిస్తాన్, పాక్  ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపైనే భారత బలగాలు దాడి చేశాయి. సాధారణ  ప్రజలు, పాక్  మిలిటరీ జోలికి పోలేదు. అయినప్పటికీ పాక్ సైన్యం భారత్​ పై దాడులకు ప్రయత్నించింది. సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలపై తూటాల వర్షం కురిపించింది. 

జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడికి పాల్పడింది. ప్రజలు, స్కూళ్లు, కాలేజీలు, మందిరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. దీంతో పాక్  దాడులకు భారత్  గట్టిగా కౌంటర్  ఇచ్చింది. రావల్పిండిలోని నూర్ ఖాన్, సింధ్ లోని సుక్కుర్, రహీమ్ యార్  ఖాన్ లో మిలిటరీ బేస్ లపై ప్రెసిషన్  స్ట్రైక్ లతో భారత సాయుధ బలగాలు విరుచుకుపడ్డాయి. వాటికి జరిగిన డ్యామేజీ తీవ్రత తాజాగా విడుదల చేసిన శాటిలైట్  ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. 

టెక్నకిల్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కమాండ్  కంట్రోల్  సెంటర్లు, రాడార్  సైట్లు, ఆయుధాలు నిల్వచేసే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని వింగ్  కమాండర్  వ్యోమికా సింగ్.. మీడియా బ్రీఫింగ్ లో వెల్లడించారు. పస్రూర్ లోని రాడార్  సైట్లు, సియాల్ కోట్  ఏవియేషన్లపైనా అత్యంత కచ్చితత్వంతో దాడి చేశామని ఆమె చెప్పారు. ఈ దాడులు నిర్వహించేటపుడు సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నామని తెలిపారు. అలాగే.. నూర్ ఖాన్  ఎయిర్ బేస్, పాక్  మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై దాడికి సంబంధించిన వీడియోలను ఎయిర్  మార్షల్, డీజీ ఏకే భారతి మీడియాకు చూపారు. రహీమ్ యార్ ఖాన్  ఎయిర్ బేస్  రన్ వేకు జరిగిన డ్యామేజీ వీడియోను కూడా విడుదల చేశారు.