టీ20 వరల్డ్ కప్2022 ఫైనల్లోకి పాకిస్తాన్

 టీ20 వరల్డ్ కప్2022  ఫైనల్లోకి పాకిస్తాన్

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లోకి పాకిస్తాన్ దూసుకెళ్లింది. సిడ్ని వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ సెమీస్లో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన పాక్..కివీస్పై 7 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. 153 పరుగుల టార్గెట్ను పాక్ మరో 5  బంతులుండగానే  ఛేదించి...ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్లోకి చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే మ్యాచ్లో విజేతతో పాక్ ఫైనల్ ఆడనుంది. 

ఓపెనర్ల హవా..
153 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ ఆజమ్ అద్భుతమైన శుభారంభాన్నిచ్చారు. కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరు పోటీ పడి మరీ పరుగులు చేశారు. పోటాపోటీగా బౌండరీలు బాదారు. వీరి ధాటికి పాక్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు సాధించింది. 


  
అర్థసెంచరీలతో అదరగొట్టారు. 
డ్రింక్స్ బ్రేక్ తర్వాత మరింత ఎనర్జీతో పాక్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజమ్ అయితే కివీస్ బౌలర్లను చితక్కొట్టాడు. వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇదే క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు రిజ్వాన్ సైతం అర్థసెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరు 76 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీ చేసిన బాబర్ ఆజమ్ 105 పరుగుల వద్ద పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ హారిస్ చెలరేగి ఆడాడు. ఓ వైపు రిజ్వాన్, మరోవైపు హారిస్..ఇద్దరు ఆడుతుంటే..కివీస్ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అయితే 57 పరుగులు చేసిన రిజ్వాన..132 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు.  రిజ్వాన్ ఔటైనా మహ్మద్ హారిస్  చెలరేగి ఆడాడు. 26 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 

రాణించిన కేన్ మామ
అంతకుముందు టాస్ గెలిచి  బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులే చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కివీస్కు గట్టి షాక్ తగిలింది.  ఓపెనర్ ఫిన్ అలెన్ తొలి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన  కేన్ విలియమ్సన్‌  డేవాన్ కాన్వేతో కలిసి  జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 21 పరుగులు చేసిన డేవాన్ కాన్వే  షాదాబ్ ఖాన్ బుల్లెట్ త్రో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో కివీస్ 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన  గ్లేన్ ఫిలిప్స్  మహమ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో  న్యూజిలాండ్ 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో  డారిల్ మిచెల్‌తో కలిసిన కేన్ మామ.. ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు నాల్గో వికెట్కు 68 పరుగులు జోడించారు. అయితే 46 పరుగులు విలియమ్సన్ .. షాహిన్ అఫ్రిది బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 

రెచ్చిపోయిన మిచెల్
విలియమ్సన్ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జేమ్స్ నీషమ్ తో  డారిల్ మిచెల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఇదే క్రమంలో సిక్సులు, ఫోర్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.  హారిస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్‌లో డబుల్‌తో మిచెల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ నవాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.