- ఎలక్షన్స్ నాటికి ఒక్క మోటరైనా నడిచేనా?
- ప్రభుత్వానికి సవాల్‌గా ‘పాలమూరు- రంగారెడ్డి’
- పూర్తికాని రిజర్వాయర్లు, కెనాల్స్, పంప్‌హౌజ్ పనులు
- ఇటీవల నార్లాపూర్, వట్టెం, ఏదుల రిజర్వాయర్ల పనులు పరిశీలించిన సీఎంవో సెక్రటరీ, మంత్రి
- బిల్లులు ఇప్పించాలని కోరిన కాంట్రాక్టర్లు
- అడ్డంకులు దాటుకుని నీళ్లు దుంకించేనా!
నాగర్‌కర్నూల్, వెలుగు: ఎనిమిదేండ్ల కింద మొదలుపెట్టిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ఒక్క మోటరైనా స్టార్ట్ చేసి నీళ్లు దుంకించడం అంత ఈజీగా అయ్యేలా కనపించడం లేదు. పూర్తికాని రిజర్వాయర్లు, మెయిన్ కెనాల్స్, పంప్‌హౌజ్‌లు, పునరావాస సమస్యలు, పెండింగ్ బిల్లులు ఇవ్వాలన్న కాంట్రాక్టర్ల ఒత్తిడి లాంటి అనేక అడ్డంకులు ఎదురుకానున్నాయి. అయితే ఎట్లైనా సరే రెండు మోటార్లు నడిపించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. జులై వరకు కనీసం ఒక్క మోటరైనా నడిపించి నీళ్లు ఇచ్చామనిపించుకోవడానికి ఆరాటపడుతోంది. ఈనెల 6న పాలమూరు ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ బృందం విజిట్ చేసింది. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సిందేనని వారితో కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు. ప్రాజెక్ట్‌లోని నార్లాపూర్ పంప్‌హౌజ్‌లో ఎలక్ట్రో మెకానికల్ పనులు, పంపులు, మోటర్ల బిగింపు ఒక్క ఎత్తైతే పంప్‌హౌజ్‌కు 300 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్, స్విచ్ యార్డ్ నుంచి లోపలికి కేబుల్ పర్చడం సవాల్‌గా మారింది. రెండున్నర నెలల్లో రెండు పంపులు స్టార్ట్ చేస్తారా అని సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ అడిగితే పెండింగ్ బిల్లులు ఎప్పుడిస్తారని కాంట్రాక్టర్ ప్రశ్నించడంతో.. ఇప్పుడా ఆ విషయం ఎందుకని మంత్రి నిరంజన్ రెడ్డి దాటేశారు.
నార్లాపూర్ రిజర్వాయర్ కట్ట పనులు, రివిట్మెంట్ పనులు దాదాపు 20శాతం పెండింగ్‌లో ఉన్నాయి. మెయిన్ కెనాల్లో మూడున్నర కి.మీల తవ్వకం మిగిలింది. రూ.130 కోట్ల బకాయిలు ఇచ్చి భూ సమస్యలు త్వరగా తేల్చాలని సదరు కాంట్రాక్టర్ కుండబద్దలు కొట్టారు. రోజు రూ.25లక్షల వరకు ఖర్చు వస్తోందని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలని ప్రశ్నించారు. నార్లాపూర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న సున్నపుతండా, వడ్డె గుడిసెల కాలనీలో ఉంటున్న దాదాపు 100 కుటుంబాలు అక్కడే ఉన్నాయి. దూల్యానాయక్ తండా, అంజనగిరిని ఖాళీ చేయించి పైకి షిఫ్ట్ చేయించారు. మిగిలిన 117 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటుకు స్థలం ఫైనల్ చేయలేదు. సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ టూర్ తర్వాత వీరిని ఖాళీ చేయించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పోలీసులను పెట్టి బలవంతంగానైనా తమను ఖాళీ చేయిస్తే కనీసం గుడిసెలు వేసుకునే స్థోమత కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. అలాగే వట్టెం రిజర్వాయర్‌లో మూడు ప్యాకేజీల కింద దాదాపు 14 కి.మీల పొడవున కట్ట నిర్మించాల్సి ఉండగా భూ సేకరణ సమస్యతో నాలుగు చోట్ల వదిలేశారు. ఇప్పుడు కట్ట అతుకుల పని పూర్తి చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా పంపులు, మోటార్లు బిగించే పని దాదాపు అదే స్థాయిలో ఉంది.
అంచనా వ్యయం పెంచినా..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రణాళికలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. శంకుస్థాపన టైమ్‌లో రూ. 35,200 కోట్ల డీపీఆర్‌కు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం మారుతున్న స్టాండర్డ్షెడ్యూల్రేట్(ఎస్ఎస్ఆర్), డిలేతో మరో రూ.16,856.31కోట్లు పెంచి రూ.52,056.31 కోట్లకు ఫైనల్చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పొలాలకు నీరందించడం, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్ట్‌కు 2015 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆయకట్టు సామర్థ్యాన్ని 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచింది. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 2.3 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు ఉంది. లిఫ్ట్ పనులు, రిజర్వాయర్లు, కాలువలు, సొరంగ మార్గాల పనులను 21 ప్యాకేజీలుగా విభజించింది. 18 ప్యాకేజీల పనులకు అప్పట్లోనే టెండర్లు ఖరారు చేసి నిర్మాణ సంస్థలకు అప్పగించింది. కొన్ని ప్యాకేజీల పనులకు ఒప్పంద గడువు ముగియగా పొడిగించింది. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కోర్టు కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో ఫిర్యాదు చేసి పనులను అడ్డుకున్నా, ఎంతో కమిట్మెంట్తో నీళ్లిస్తున్నామని చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు మూడు లిఫ్టుల్లో ఒక్కో పంపు, మోటర్ నడిపించేందుకు ప్లాన్ చేస్తున్నా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ఫలితమివ్వని రివ్యూలు, టూర్లు
2015 జూన్11న పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన ప్రభుత్వం రెండేండ్లలో పూర్తి చేసి 12.30లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్ అవసరాలకు నీరిస్తామని చెప్పింది. బడ్జెట్లో నామ్‌కే వాస్తే కేటాయింపులతో రూ.35,200 వేల కోట్ల అంచనాను దాదాపు రూ.52 వేల కోట్లకు చేర్చింది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఒకసారి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ రెండు సార్లు, స్వయంగా సీఎం కేసీఆర్ ఒక సారి ప్రాజెక్ట్ సైట్లను విజిట్ చేసి రివ్యూ చేశారు. రిటైర్డ్ ఇంజినీర్ల టీమ్‌ను పంపించి అంచనా వేయించారు. ఇంత చేసినా నార్లాపూర్ నుంచి ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీటిని అందించే ఒక టీఎంసీ అండర్ గ్రౌండ్ మెయిన్ కెనాల్ పనులు, సర్జిపూల్పై ఒత్తిడి లేకుండా అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చే నీటి ప్రెషర్‌ను కంట్రోల్ చేసే హెడ్ రెగ్యులేటరీ పనులు వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. హెడ్ రెగ్యులేటరీ నిర్మించకపోవడంతో కల్వకుర్తి పంప్‌హౌజ్‌లో రెండు సార్లు మోటర్లు మునిగిన సంగతి తెలిసిందే.