రామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు

రామగిరి ఖిల్లాకు మహర్దశ..టూరిస్ట్ స్పాట్గా మార్చేందుకు రూ.5 కోట్లు మంజూరు
  • అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించిన సర్కార్
  • పర్వతమాల ప్రాజెక్ట్​ కింద రోప్​ వే ఏర్పాటు

పెద్దపల్లి, వెలుగు:శతృదుర్భేద్యమైన కోట,  ప్రకృతి రమణీయతకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి ఖిల్లాను టూరిజం స్పాట్​గా డెవలప్​ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కేటాయించింది. ఇందులో అటవీ శాఖకు రూ. 1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ. 3.86 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

దీంతో పాటు కేంద్రం పర్వతమాల ప్రాజెక్టు కింద రామగిరికి రోప్​వే మంజూరు చేసింది. దీని కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేశారు. ఇందుకు సంబంధించిన సర్క్యులర్  ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు రావాల్సి ఉంది. ఇటీవల పీసీసీఎఫ్  సువర్ణ రామగిరి ఖిల్లాను సందర్శించి, అటవీ శాఖ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేశారు. 

ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు, రామగిరి ఖిల్లా చరిత్ర, ప్రాముఖ్యత తదితర అంశాలు, శిల్పకళ, ప్రకృతి సోయగాలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. రామగిరిని టూరిస్ట్​ స్పాట్​గా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫారెస్ట్, టూరిజం శాఖల ఆధ్వర్యంలో..

ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఖిల్లాపైకి వెళ్లేందుకు వీలుగా మెట్ల నిర్మాణం, పసరు బావులు శుభ్రం చేయడం, రక్షణ కంచె ఏర్పాటు, స్వాగత తోరణం, వాహనాల పార్కింగ్, ఖిల్లాపై వాచ్‌ టవర్, హోటల్, వసతి, పిల్లలు ఆడుకునేలా ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన నివేదికను ఇటీవల అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించారు.

 పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రామగిరి ఖిల్లా ఉంది. రామగిరి మండలంలోని బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల నడుమ రామగిరి విస్తరించి ఉంది. ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్లు, ఆయుర్వేద వైద్యులు, వృక్షశాస్త్రవేత్తలు బొటానికల్​ టూర్​ కోసం ఇక్కడకు వస్తుంటారు. 

ఖిల్లాను చేరుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి రోడ్డు మార్గాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో టూరిస్ట్​ స్పాట్​గా రామగిరి ఖిల్లాను అభివృద్ధి  చేయడం ద్వారా పెద్దపల్లి జిల్లా అభివృద్ది చెందడంతో పాటు రోడ్డు, రవాణా, బిజినెస్​ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. రామగిరిని సర్కార్​ టూరిస్ట్​ స్పాట్​గా డెవలప్​ చేయనుండడంతో ఖిల్లాకు పర్యాటకుల తాకిడి పెరిగి సమీప మండలాలు కూడా డెవలప్​ అవుతాయని అంటున్నారు.

మావోయిస్టుల షెల్టర్​ జోన్​గా..

గతంలో రామగిరి ఖిల్లా మావోయిస్టులకు సెల్టర్​ జోన్​గా ఉండేది. దీంతో రామగిరి ఖిల్లా పరిసర ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే వాదనలున్నాయి. రామగిరి ఖిల్లా గతంలో కమాన్​పూర్​ మండలంలో ఉండేది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా ఖిల్లా పేరుపైనే రామగిరి మండలం ఏర్పాటైంది. 

గతంలో రామగిరి ఖిల్లా చుట్టుపక్కల గ్రామాలైన బేగంపేట, రత్నాపూర్, మచ్చుపేట, మైదబండ, లక్కారం గ్రామాలకు రవాణా సౌకర్యం అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో మావోయిస్టులు రామగిరిని షెల్టర్​ జోన్​గా చేసుకున్నారు. పోలీసులు ఖిల్లా ఒకవైపు నుంచి కూంబింగ్​ స్టార్ట్​ చేస్తే, మరో వైపు నుంచి మావోలు వెళ్లి పోయేవారు. 

రామగిరి ఖిల్లాపై మావోయిస్టు పార్టీలోనే మొట్ట మొదటి కోవర్టు ఆపరేషన్​ జరిగింది. ఈ కోవర్డు ఆపరేషన్​తో రామగిరి ఖిల్లాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఖిల్లా వరకు నాలుగు వైపుల నుంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటైంది. 

కానీ, ఖిల్లా పైకి వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో 10 కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లక తప్పదు. రానున్న రోజుల్లో రామగిరి ఖిల్లాకు నాలుగు వైపులా రహదారులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే గ్రీన్​ ఫీల్డ్​ హైవే ఖిల్లా దగ్గరలోని ముత్తారం మీదుగా భూపాలపల్లి వైపు వెళ్తోంది. అలాగే పెద్దపల్లి నుంచి కునారం మీదుగా, ఇదులాపూర్​ నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లి రోడ్​ మంజూరైంది.