- జిల్లాలో పెరిగిన లైంగికదాడులు, కిడ్నాప్‌లు
- తగ్గిన పగటి చోరీలు.. పెరిగిన రాత్రి దొంగతనాలు
- కిడ్నాప్‌లు, అపహరణల కేసులు పెరిగాయి
- ఫేక్ కరెన్సీల ముఠాల పట్టివేత
- 2025 ఏడాది క్రైం వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్ చంద్ర
- 2026లో ప్రతి క్రైం ఆన్లైన్ చేస్తామని వెల్లడి
కామారెడ్డి, వెలుగు : ‘కామారెడ్డి జిల్లాలో గతేడాది కంటే 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. నిరంతర తనిఖీలు, చెక్‌పోస్టులు, డ్రంక్అండ్డ్రైవ్టెస్ట్లు చేపట్టాం. బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. మరో వైపు లైంగికదాడులు, పోక్సో కేసులు పెరిగాయి. పగటి పూట చోరీలు తగ్గగా, రాత్రి దొంగతనాలు పెరిగాయి.
కిడ్నాప్‌లు, అపహరణల కేసుల సంఖ్య పెరిగింది’ అని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. బుధవారం అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డిలతో కలిసి 2025 ఏడాది క్రైం వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు...
గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ఇతర శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామన్నారు. తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం, హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించామన్నారు. 2024లో 569 యాక్సిడెంట్ కేసులు ఉంటే ఈ ఏడాది 486 కేసులు నమోదయ్యాయన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 83 కేసులు తగ్గాయన్నారు. గత ఏడాది 262 రోడ్డు ప్రమాదాలు జరిగితే, ఇందులో 275 మంది చనిపోయారని తెలిపారు. ఈ ఏడాది 200 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇందులో 211 మంది మృతి చెందారని, గతేడాది కంటే మృతుల సంఖ్య 64 తగ్గిందన్నారు. గాయాల కేసులు నిరుడు 263 ఉంటే ఈఏడాది 242 నమోదు కాగా, గతేడాది కంటే 21 కేసులు తగ్గాయని వివరించారు.
దొంగతనాలు ఇలా..
2024లో హత్య చేసి వస్తువుల అపహరణ కేసులు 8 నమోదు కాగా, 2025లో 5 కేసు నమోదయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. 100 శాతం నిందితులను గుర్తించామని, 96 శాతం చోరీ సొత్తు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది దోపిడీ కేసులు పెరిగాయని, నిరుడు 15 కేసులు నమోదైతే ఈఏడాది30 కేసులు నమోదయ్యాయన్నారు. పగటి పూట చోరీలు తగ్గాయన్నారు. 2024లో 18 చోరీలు జరగగా, 2025లో 15 చోరీలు జరిగాయన్నారు. రాత్రి పూట దొంగతనాలు 2024లో 196 జరగగా, ఈ ఏడాది 209 జరిగాయని, 13 కేసులు పెరిగాయని తెలిపారు.
పెరిగిన రేప్, పోక్సో కేసులు..
2025లో రేప్, పోక్స్ కేసులు పెరిగాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. 2024లో 61 రేప్కేసులు నమోదు కాగా, 2025లో 67 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది వేధింపుల కేసులు 3 శాతం తగ్గాయన్నారు. నిరుడు 112 వేధింపుల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 109 కేసులు నమోదయ్యాయన్నారు.
పోక్సో కేసులు ఈ సంవత్సరం 12 శాతం పెరిగాయన్నారు. 2024లో 89 పోక్సో కేసులు నమోదు కాగా, 2025లో 101 కేసులు నమోదయ్యాయన్నారు. వరకట్నం చావులు నిరుడు, ఈఏడాది సమానంగా 2 చొప్పున జరిగాయన్నారు. 2024లో 312 వరకట్నం కేసులు ఉంటే ఈ ఏడాది 247 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఫేక్ కరెన్సీ, పార్ధి ముఠాల పట్టివేత..
ఫేక్ కరెన్సీ ముఠాతో పాటు, 2 పార్ధి ముఠాలను పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రంలో దొరికిన రూ.2 కోట్ల ఫేక్ కరెన్సీని వివరాల కోసం కూపీ లాగితే బీహార్‌లో తయారు చేసే నకిలీ కరెన్సీ ముఠా పట్టుబడిందని, వీరంతా జైలులో ఉన్నారని పేర్కొన్నారు.
2025లో ట్రాఫిక్ కేసులు..
హెల్మెట్ లేకుండా బైక్‌లపై వెళ్లిన 3,16,839 మందికి ఫైన్లు వేశామని ఎస్పీ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపిన 1,32,315 మందికి జరిమానా విధించామన్నారు. వెహికల్స్ ఓవర్ స్పీడ్ కేసులో 98,717 మందికి, సెల్‌ఫోన్ డ్రైవింగ్ 1,368 మందికి, త్రిపుల్ రైడింగ్‌లో 4,410 మందికి ఫైన్లు విధించినట్లు తెలిపారు.
ఈ ఏడాది 12 మందికి జీవిత ఖైదు పడిందని, వివిధ కేసుల్లో ఏడాది నుంచి జీవిత ఖైదు వరకు 460 మందికి శిక్షలు పడ్డాయన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి 980 ఫిర్యాదులు వస్తే 160 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయన్నారు. రూ.5 కోట్ల 82 లక్షలు నష్టం జరిగితే రూ.1 కోటీ 7 లక్షలు సైబర్ నేరగాళ్ల నుంచి రివకరీ చేశామని ఎస్పీ వివరించారు.
2026లో ప్రతి ఫిర్యాదు ఆన్లైన్లో..
2026 లో ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ చేస్తామని ఎస్పీ చెప్పారు. ఎంక్వైరీ అనంతరం ఎఫ్ఐఆర్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో నేరాలు తగ్గించేందుకు పోలీసు శాఖ ద్వారా వివిధ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజల సహకారంతో నేరాలను తగ్గిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
ఆపరేషన్ కవచ్‌తో నేరాల నివారణ..
ఆపరేషన్ కవచ్‌తో జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టినట్లు ఎస్పీ చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి ప్రతి రోజు రాత్రి జిల్లావ్యాప్తంగా 16 చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. హైవే, ఇతర రోడ్లపై తిరిగే ప్రతి వెహికల్‌ను రాత్రి వేళల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. 5 నెలల్లో 97,822 వెహికల్స్ తనిఖీ చేయగా, 26,636 మంది అనుమానితులను చెక్చేశామన్నారు. రాత్రి వేళల్లో డ్రంక్ డ్రైవ్‌లో 1,041 కేసులు నమోదు చేశామని, 64 మందిని అనుమానితులను గుర్తించామన్నారు.
ఆపరేషన్ కవచ్‌తో మంచి ఫలితం వచ్చిందని, నేరాలు తగ్గాయన్నారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి నేరస్తులు రావటానికి జంకుతున్నారని తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలను కట్టడి చేయడంతో అక్రమ రవాణా తగ్గిందన్నారు. కాకీ విత్ కిడ్స్ ప్రోగ్రాం ద్వారా పెద్దవాళ్లు బైక్‌పై బయటకు వెళ్లేటప్పుడు హెల్మెల్ ధరించి వెళ్లాలని పిల్లలు సూచిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు.
