- యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తం: మంత్రి ఉత్తమ్
- వచ్చే ఏడాది మార్చికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ కంప్లీట్
- ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు, ఎమ్మెల్యేలతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాబోయే రెండున్నరేండ్లలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆదివారం జలసౌధలో ఆయన ఆ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రివ్యూ చేశారు.
రాష్ట్రానికి దక్కాల్సిన జలాల్లో చుక్క కూడా వదులుకోబోమని ఉత్తమ్ స్పష్టం చేశారు. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. కల్వకుర్తికి రూ.909 కోట్లు, నెట్టెంపాడుకు రూ.252 కోట్లు, భీమాకు రూ.200 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.185 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఆయా ప్రాజెక్టులను మిషన్ మోడ్‌లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం భూసేకరణను ప్రాధాన్యంగా తీసుకున్నదని, పరిహారం విషయంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. జూన్ 2 నాటికి కీలకమైన ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, అందుకు రూ.5 వేల కోట్లు కూడా కేటాయిస్తున్నారని తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్ట్ సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. సోర్సును మార్చడం వల్ల లిఫ్టింగ్ కాస్ట్ భారీగా పెరిగిందని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా అలాగే తయారైందన్నారు. ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద సోర్సును మేడిగడ్డకు మార్చి కాళేశ్వరంగా రీడిజైన్ చేశారని, ఫలితంగా దాని లిఫ్టింగ్ కాస్ట్ కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాధాన్యపరంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.
కృష్ణా బేసిన్‌లోని రైతులకు నీళ్లిచ్చి తీరుతామని, మంచి పంటలు పండేలా చూస్తామని, ఆర్థిక మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామంటూ గత ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రాజెక్టుకు రూ.35,200 కోట్లకు అప్రూవల్స్ ఇచ్చారని, ఆ తర్వాత దాని అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. అందులో కేవలం రూ.27 వేల కోట్ల పనులే బీఆర్ఎస్ పూర్తి చేసిందన్నారు.
జూరాల పూడిక
జూరాల ప్రాజెక్టు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రాజెక్ట్ నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీల నుంచి 9 టీఎంసీలకు పడిపోయిందన్నారు. కృష్ణా జలాల్లో వాటా హక్కులను పూర్తిగా వాడుకుంటున్నామని, ఒక్క చుక్కను కూడా వదులుకోవట్లేదని స్పష్టం చేశారు.
కృష్ణా బేసిన్లో.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ ఆయకట్టులో పంటలు వేశారని, ఎక్కువ దిగుబడులు వచ్చాయని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్లో 148.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రివ్యూలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
