CM క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత : పాలమూరు-రంగారెడ్డి నిర్వాసితుల అరెస్ట్

CM క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో ఉద్రిక్తత : పాలమూరు-రంగారెడ్డి నిర్వాసితుల అరెస్ట్

నాగర్ కర్నూలు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తత రేపింది. ఈ ఉదయం నాగర్ కర్నూలు జిల్లా పట్టెం గ్రామం నుంచి ప్రాజెక్టు భూ నిర్వాసితులు పాదయాత్ర ప్రారంభించి పోరుబాట పట్టారు. భూములు, ఇండ్లు కోల్పోయిన  నిర్వాసితులు….సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరారు. ఐతే… నిర్వాసితులు పాదయాత్రగా మొదలైన కొద్దిసేపటికే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తమను అడ్డుకోవద్దని.. క్యాంప్ ఆఫీస్ ముట్టడించి న్యాయం కోసం పోరాడతామని నిర్వాసితులు చెప్పారు. వారిని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడినుంచి పంపించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాధితులు నెత్తీ నోరూ బాదుకుంటూ మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా వట్టెం గ్రామానికి చెందిన నిర్వాసితులు… 20 రోజుల క్రితమే చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు తమ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. హామీ ఇచ్చి 20 రోజులు గడిచినా… ఎలాంటి స్పందన లేకపోవటంతో చలో ప్రగతి భవన్ అంటూ యాత్రను మొదలు పెట్టేందుకు ప్రయత్నించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ఏ విధంగా పరిహారం ఇచ్చారో… అదే విధంగా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంప్ ఆఫీసు కు చేరుకునే వరకు ఆగే సమస్య లేదంటున్నారు భూ నిర్వాసితులు.