మేము తుమ్మల వెంటే... మేమంతా

మేము తుమ్మల వెంటే... మేమంతా
  • బీఆర్ఎస్​ కు మూకుమ్మడిగా రాజీనామాలు
  • పాలేరు నియోజకవర్గంలో వెయ్యి మంది పార్టీకి గుడ్ బై
  • జిల్లా అభివృద్ధి తుమ్మలతోనే సాధ్యమన్న అనుచరులు

ఖమ్మం రూరల్, వెలుగు : కష్టమొచ్చినా, నష్టమొచ్చినా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటే నడుస్తామని పాలేరు నియోజవర్గానికి చెందిన తుమ్మల అనుచరులు స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్  పార్టీలో తుమ్మల చేరినందున ఆయనతో పాటు కాంగ్రెస్​ కండువా కప్పుకునేందుకు పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు సుమారు వెయ్యిమంది బీఆర్ఎస్​ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం శ్రీసిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల ముఖ్య అనుచరుడు సాధూ రమేశ్ ​రెడ్డి మాట్లాడారు. 

తుమ్మల నాగేశ్వరరావుతోనే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి జరుగుతుందని భావించి పాలేరు నియోజవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీలు, సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, రైతుబంధు సమితి కన్వీనర్లు, పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు మూకుమ్మడిగా బీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేశారని ఆయన తెలిపారు. జిల్లా సస్యశ్యామలంగా ఉండాలని అనుక్షణం తపించిన నాయకుడు  తుమ్మల అని ఆయన పేర్కొన్నారు. నాడు భక్తరామదాసు శ్రీరాముడి కోసం గుడి నిర్మించాడని, నేడు తుమ్మల భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించడంతో నియోజవర్గంలో వేసవి కాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. కేవలం రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేసి రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశారని కొనియాడారు. పాలేరు పాత కాల్వ పునరుద్ధరణ ద్వారా నేలకొండపల్లి మండలంలో చివరి ఆయకట్టుకు కూడా నీరందించిన ఘనత తుమ్మలకే దక్కుతుందని చెప్పారు. ‘‘ప్రతి తండా, ప్రతి గ్రామానికి తుమ్మల రోడ్లు వేయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకు గురుకులాలు కట్టించారు. ఎంతో మంది పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. యాభై ఏళ్లలో చూడని అభివృద్ధిని రెండున్నరేళ్లలోనే తుమ్మల చేసి చూపించారు. నాలుగున్నర ఏళ్లుగా లోకల్​ నాయకులు ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టి క్యాడర్​ అంతా ఇబ్బంది పడుతున్నా సంయమనం పాటించారు. 

పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా భరించారు. అయినా సీఎం కేసీఆర్.. తుమ్మలకు పాలేరు టికెట్​ ఇవ్వకుండా కనీసం మాట్లాడకుండా అవమానపరిచారు. ఓడిపోయిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశామని చెబుతున్నారు. అది తుమ్మల మీద ప్రేమతో ఇవ్వలేదు. నాడు కొత్తగూడెంలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. ఒకే ఒక్క ఎంపీటీసీ గెలిచారు. అలాంటి బీఆర్ఎస్​ పార్టీలో జిల్లాలో వేలమంది ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను చేర్చి పార్టీని ఎంతో ఆయన ఎంతో అభివృద్ధి చేశారు” అని రమేశ్  రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్​ పార్టీలో కనీస గౌరవం లేదని, ఆత్మాభిమానం చంపుకుని పార్టీలో పనిచేయాల్సి రావడం దౌర్భాగ్యం అని ఆయన విమర్శించారు. నాయకులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు తుమ్మల.. కాంగ్రెస్​ పార్టీలో చేరారని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసిన పాలేరు ప్రజలు కాళ్లు కడగటమే ఆయన కల అని రమేశ్  అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.