పల్లి  రైతుల పరేషాన్

పల్లి  రైతుల పరేషాన్
  • ప్రత్యామ్నాయ పంటల మార్కెటింగ్​పై నిర్లక్ష్యం
  • ఎకరానికి  10 వేలు నష్టపోతున్నామంటూ ఆవేదన
  • మార్కెట్​ను కంట్రోల్​ చేస్తున్న ఆయిల్​ మిల్లర్లు

నిజామాబాద్,  వెలుగు:ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో వరికి బదులు పల్లి సాగుచేసిన రైతులు  పంటకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట మార్చుకోవాలని ప్రచారం చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్​వసతులు కల్పించలేకపోయింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆయిల్​ మిల్లర్స్​ సిండికేట్ గా మారి రేట్లు కంట్రోల్​ చేస్తున్నారు. ఆరు నెలల పాటు పంటను  కంటికిరెప్పలా కాపాడుకున్నా.. కనీసం పెట్టుబడి కూడా తిరిగిరాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
   
యాసంగి సీజన్ లో  వరి సాగు చేయొద్దని ప్రభుత్వం  ప్రకటించడంతో నిజామాబాద్ జిల్లాఆర్మూర్​ఏరియాలో  2 వేల ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు.మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి, మెట్ పల్లి ,  గొట్టిముక్కల, మాణిక్​భండార్, ఢీకంపల్లి, కల్లెడి, మదనపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి గ్రామాల్లో రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో పల్లి పంట వేశారు. నూనెగింజలకు  డిమాండ్ ఉంటుందని రైతు సదస్సుల్లో  వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఈ పంటవైపు మొగ్గు చూపారు.  విత్తనాలకు ఎకరానికి రూ. 7 వేలు ఖర్చయ్యాయి. ట్రాక్టర్​, కూలీలు, ఎరువులు అన్ని కలిపి ఒక ఎకరంలో పల్లి సాగు చేసేందుకు రూ. 35 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ సారి అకాల వర్షాలతో పంటలకు తెగుళ్లు సోకడం దిగుబడి మీద ప్రభావం చూపింది. ఎకరానికి దాదాపు 10  క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా ఈసారి  6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. జిల్లాలో పల్లి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎక్కడా  కొనుగోలు కేంద్రాలు లేవు. దీంతో  ఆయిల్ మిల్లుల యజమానులు చెప్పిందే ఫైనల్​ అన్నట్టు పరిస్థితి మారింది. కొందరు రైతులు సరుకును మహారాష్ట్రలోని ధర్మాబాద్​కు తరలిస్తున్నారు. అక్కడ కూడా నిజామాబాద్​కు చెందిన ఆయిల్​మిల్లర్ల మనుషులు చక్రం తిప్పుతున్నారు. అక్కడికి తీసుకెళ్తే  ట్రాన్స్​పోర్ట్​ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు వాపోతున్నారు.  లోకల్​ మార్కెట్లో ఆయిల్​ మిల్లుల యజమానులు క్వింటాలు పల్లి  ధర రూ. 3,500లకు కొంటున్నారు. క్వాలిటీ బాగా లేదని సాకులు చెప్తూ రేటును తగ్గించేశారు. ఈ లెక్కన ఎకరానికి రైతులకు   రూ. 24,500లకు మించి రావడంలేదు. పల్లి రైతులు ఎకరానికి రూ. 10 వేలు నష్టపోతున్నారు. మార్కెట్​లో సిండికేట్​ను, దళారులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. మార్కెట్​లో డిమాండ్​ ఉన్నందున క్వింటాలుకు రూ. 8 వేల రేటు దక్కేలా చూడాలని కోరుతున్నారు.