సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావు అరెస్ట్పై సస్పెన్స్

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావు అరెస్ట్పై  సస్పెన్స్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు అరెస్ట్ పై సస్పెన్స్ నెలకొంది. సుబ్బారావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. విధ్వంసం ఘటనపై  ప్రశ్నిస్తున్నామని  పల్నాడు SP రవిశంకర్ తెలిపారు. హైదరాబాద్ పోలీసుల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు అరెస్ట్ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక యూపీ పోలీసులు సుబ్బరావును అదుపులోకి తీసుకున్నారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కాగా ఈ అల్లర్లకు గుంటూరు నుంచే కుట్ర జరిగిందని జీఆర్పీ పోలీసులు తెలిపారు. 

గాంధీ ఆస్పత్రి నుంచి 9మంది డిశ్చార్చి

మరోవైపు ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న 9మందిలో ఆరుగురిని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు డిశ్చార్జి చేశారు. మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసుల నో అబ్జెక్షన్ తర్వాతే కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇక డిశ్చార్జి అయిన వారి వివరాలను జీఆర్పీ పోలీసులు సేకరించారు. కాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. ఆందోళనల టైమ్ లో 45 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, 44 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 46 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని వెల్లడించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 30 కోచ్‌‌లు ధ్వంసమయ్యాయి. దాదాపు రూ.20 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ దాడిలో మొత్తం 1,500 నుంచి 2 వేల మంది పాల్గొన్నారు” అని వివరించారు. దాడిలో పాల్గొన్న వారందరూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారేనని, వేరే రాష్ట్రాల వారెవరూ లేరన్నారు.