గ్రేటర్‍ వరంగల్‍ మున్సి పల్‍ కార్పొరేషన్‍ లో జీడబ్ల్యూఎంసీలో కరపత్రాల కలకలం

గ్రేటర్‍ వరంగల్‍ మున్సి పల్‍ కార్పొరేషన్‍ లో జీడబ్ల్యూఎంసీలో కరపత్రాల కలకలం

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍లో బుధవారం మేయర్‍ గుండు సుధారాణి పాలకవర్గం పాలన గడువు ముగిసింది. కాగా, తెల్లారే జీడబ్ల్యూఎంసీలో ‘జవాబుదారీతనం లేని గ్రేటర్ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్’.. కార్పొరేషన్‍ అభివృద్ధి కోరే ప్రజల పేరుతో కరపత్రాలు కనిపించడం కలకలం రేపింది. స్పెషల్‍ ఆఫీసర్‍ బాధ్యతలు తీసుకోడానికి వచ్చే ముందే డీటీపీ చేయించిన కరపత్రాలు కనిపించడంపై చర్చ జరిగింది. కరపత్రాల్లో ప్రధానంగా ఇన్​చార్జి కమిషనర్‍గా హనుమకొండ కలెక్టర్‍ అభివృద్ధిని పట్టించుకోవట్లేదని వెల్లడించారు. 

నగరంలో భారీగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా.. సిటీ ప్లానర్‍ మొదలు చైన్‍మెన్‍ వరకు మామూళ్లు ఇవ్వకుంటే ఫైల్‍ కదలడం లేదని ఆరోపణలు చేశారు. ఇంజనీరింగ్‍ సెక్షన్‍లోని కొన్ని విభాగాలు, క్వాలిటీ కంట్రోల్‍, వెహికల్‍ షెడ్లు, డీబీ డ్రాయింగ్‍ బ్రాంచ్‍, సీసీ రోడ్లు, డ్రైనేజీ బిల్లుల చెల్లింపులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్‍ఈ నుంచి ఏఈ వరకు అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి పర్సంటేజీలు తీసుకోకుండా పనులు చేయట్లేదని ఆరోపించారు. 

40వ డివిజన్‍ పరిధిలో సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు. మున్సిపల్‍ యాక్ట్  ప్రకారం 3 ఏండ్లు ఒకే చోట పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని వేరే జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్‍ చేశారు. సీఎం రేవంత్‍రెడ్డి జీడబ్ల్యూఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇదిలాఉంటే గురువారం ఉదయం వరంగల్‍ తూర్పు బీఆర్‍ఎస్‍ నేతలు ఈ ప్రాంతంలో ధర్నా నిర్వహించిన కాసేపటికే జీడబ్ల్యూఎంసీ క్యాంటిన్‍లో కరపత్రాలు ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేషన్‍ సిబ్బంది సహకారంతోనే ఈ కరపత్రాలు బయటకు వచ్చాయని భావిస్తున్నారు. కరపత్రాలపై ఎస్‍బీ అధికారులు ఆరా తీశారు.