- కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసిన పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ (పీఏఎంఎస్) మండిపడింది. టీఏఎఫ్ఆర్సీ రూల్స్ ప్రకారం నాలుగున్నర ఏండ్లకే ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, ఐదో ఏడాది ఫీజు కూడా కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్లర్ రమేశ్ రెడ్డిని పేరెంట్స్అసోసియేషన్ప్రతినిధులు కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ లోని చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగున్నర ఏండ్ల ఫీజు చెల్లించినప్పటికీ, ఐదో ఏడాది ఫీజు కట్టకపోతే హౌస్ సర్జన్ (ఇంటర్న్‌షిప్) చేసేందుకు అనుమతించబోమని కాలేజీ మేనేజ్మెంట్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
