- ఓట్లు చీలి ప్రత్యర్థులకు లాభం కలగకుండా ముందస్తుగానే నేతల అలర్ట్
- ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు
- 2019లో జయశంకర్ భూపాలప్లలి జిల్లాలో 32 జీలు ఏకగ్రీవం
జయశంకర్భూపాలపల్లి, వెలుగు: గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పల్లెల్లో కీలక పదవి అయిన సర్పంచ్గిరిపైనే అందరి చూపు ఉండడంతో ఆశావహులు పెద్దసంఖ్యలో రెడీ అవుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచి గ్రామ ప్రథమ పౌరుడి కుర్చీని దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఓట్లు చీలి ప్రత్యర్థులకు లాభం కలుగకుండా ముందుగానే ప్రణాళికలు రచిస్తున్నారు.
కుల సంఘాలను, గ్రామ పెద్దలను కలుస్తూ వారిని ఆశీర్వదించాలని ప్రచారం ప్రారంభించారు. కాగా, ప్రధాన పార్టీలు ముందుగానే అవకాశం ఉన్నచోట ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లాలో 248 గ్రామపంచాయతీలు ఉండగా, మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడుతలో జిల్లాలోని కొత్తపల్లిగోరి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 జీపీలతో పాటు 712 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
51 జీపీలో ఓటర్లు 500 లోపే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 51 గ్రామ
పంచాయతీల్లో 500 లోపు ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీలో 8693 ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కొత్తపల్లిగోరి మండలం చెంచుపల్లిలో 164 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో మేజర్ గ్రామపంచాయతీల్లోనే తీవ్ర పోటీకి అవకాశం ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలబడుతున్నాయి. ఇక్కడ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
ఎన్నికలకు సిద్ధం..
పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని మొదటి విడతలో నాలుగు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఏకగ్రీవాల కోసం బేరసారాలు..
జిల్లాలో 2019 ఎన్నికల్లో 32 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈసారి కూడా వివిధ రాజకీయ పార్టీలు ఏకగ్రీవంపై దృష్టిసారించాయి. మేజర్, మైనర్ పంచాయతీలు అనే తేడా లేకుండా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఏకగ్రీవం అయితే అభ్యర్థుల గ్రామాభివృద్ధికి డెవలప్ మెంట్ ఫండ్ తోపాటు ప్రభుత్వం అందించే నజరానాతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.
