- ఉమ్మడి జిల్లాలో 21 మండలాల్లోని 492 జీపీలు, 3303 వార్డులకు ఎలక్షన్స్
- 3764 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 5,21,358 మంది ఓటర్లు
- ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు ఓటింగ్.. 2 గంటల నుంచి కౌంటింగ్
ఆదిలాబాద్/నిర్మల్/ఆసిఫాబాద్/మంచిర్యాల, వెలుగు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు వేళైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి, 2 గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాలు ఇచ్చోడ, సిరికొండ, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లిలోని 166 గ్రామపంచాయతీలు, 1390 వార్డులో ఎన్నికలు జరగనున్నాయి.
550 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2041 వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. మొత్తం 1048 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,69,387 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 938 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అఖిల్ మహాజన్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్, కెరిమెరి, లింగాపూర్, సిర్పూర్(యు), వాంకిడిమండలాల్లోని 109 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 944 వార్డుల్లో 576 ఏకగ్రీవంగా కాగా.. 327 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 944 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1133 మంది పీవోలు,1208 మంది ఓపీవోలు విధులు నిర్వహించనున్నారు. ఐదు మండల కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 147 వాహనాల్లో ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
56 లోకేషన్లలో 326 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీంచనున్నారు.20 లోకేషన్లలో136 కేంద్రాలను మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 750 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించున్నారు. మొత్తం 99,844 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 49477, మహిళలు 50360, ఇతరులు 7 మంది ఓటర్లు ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 81 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, 514 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2,600 మంది సిబ్బందిని పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో మొత్తం 748 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 24 లొకేషన్ల ద్వారా 200 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. మొత్తం 1,24,882 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 60,881 మంది, మహిళలు 64,001 మంది ఉన్నారు.
పోలింగ్‌సిబ్బంది బుధవారం సాయంత్రం వారికి కేటాయించిన గ్రామాలకు ఎన్నికల సామగ్రితో తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్యతో కలిసి జిల్లాలోని పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్‌దీపక్ సందర్శించారు. ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.
నిర్మల్ జిల్లాలో ఓటేయనున్న 1,27,245 మంది ఓటర్లు
నిర్మల్ జిల్లాలో 6 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, లక్ష్మణచందా, మామడ మండలాల్లోని 136 గ్రామ పంచాయతీ పరిధిలో 1,27,245 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు 66,667, కాగా పురుషులు 60,576 మంది ఉన్నారు. ఇద్దరు ఇతరులు. మొత్తం 1072 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 136 సర్పంచ్‌స్థానాలు, 1072 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
బుధవారం ఈ 6 మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం వారందరినీ కేటాయించిన గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. ఎన్నికలను కలెక్టర్ అభిలాష అభినవ్, భద్రతను ఎస్పీ జానకీ షర్మిల పర్యవేక్షించనున్నారు.

