- పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు
- పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఎస్ఈసీకి చేరిన రిజర్వేషన్ల జాబితాలు
- ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే చాన్స్
- జడ్జి సెలవులో ఉండటంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్లు పంచాయతీరాజ్‌శాఖ కమిషనరేట్‌కు సోమ వారం మధ్యాహ్నం చేరుకున్నాయి. 31 జిల్లాల నుంచి మూడుసెట్ల గెజిట్లు జిరాక్స్ కాపీలతోపాటు పెన్‌డ్రైవ్‌లో తీసుకొని కమిషనరేట్‌లోని హెల్ప్ డెస్క్‌లో డీపీవోలు అందజేశారు. వీటిని పీఆర్ ఆఫీసర్లు పరిశీలించి, ఆ తర్వాత జిల్లాల వారీగా ఒక్కో సెట్ గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)కి అప్పగించారు. మరో సెట్ గెజిట్ కాపీలను సీఎస్ రామకృష్ణకు పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ సంబంధించిన అంశం ఇక ఎస్ఈసీ చేతుల్లోకి వెళ్లింది. ఒకటీ రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
పంచాయతీ ఎన్నికలపై విచారణ నేటికి వాయిదా
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించాల్సి ఉండగా.. సంబంధిత జడ్జి సెలవులో ఉండటంతో విచారణ సాధ్యం కాలేదు. దీంతో తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశామని, ఇటీవల ఎన్నికల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలియజేయనున్నది. కోర్టు ఆదేశాలకు తగ్గట్టు ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలుపనుంది. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్ఈసీ భావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు ఇచ్చామని, జిల్లాలవారీగా వచ్చిన రిజర్వేషన్ల గెజిట్లను కూడా ఎన్నికల సంఘానికి అందజేశామని హైకోర్టు దృష్టికి పంచాయతీ రాజ్ శాఖ తీసుకెళ్లనుంది.
26 లేదా 27న షెడ్యూల్?
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా కూడా చేతికి రావడంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతున్నది. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో షెడ్యూల్ రావొచ్చన్న ప్రచారం జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి న్యాయ, సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, మంగళవారం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుతోపాటు కేబినెట్ సమావేశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తు న్నది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ బాక్సుల నుంచి సిబ్బంది నియామకం వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
