పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్లు ఎప్పుడు?

పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌లో ప్రమోషన్లు ఎప్పుడు?
  • ఎంపీడీవోలు, డీపీవోలు, డీఆర్డీవోలకు తప్పని నిరీక్షణ
  • క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్ల ప్రక్రియ
  • రెండోసారి ప్రభుత్వం ముందుకు ప్రమోషన్ల జాబితా

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురూచూస్తున్నారు. ఏండ్లుగా పదోన్నతులపై ప్రభుత్వాలు ఫోకస్ పెట్టకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చెందతున్నారు. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి ఉన్నా.. ఉన్నతాధికారులు చొరవ తీసుకోకపోవడంతో ఫైల్ ముందుకు కదలడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి సీనియర్ అధికారుల లిస్టును పంపించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటి. పల్లెల్లో ఏ అభివృద్ధి జరగాలన్నా ఈ శాఖ అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు.

అయితే, ప్రమోషన్‌‌‌‌‌‌‌‌కు అర్హత ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన జీవో రాకపోవడంతో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పీఆర్ శాఖలో ఎంపీడీవోలు, డీపీవోలు, డీఆర్డీవోలు ప్రమోషన్ల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 37 మంది ఎంపీడీవోలు ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. డీపీవోలు డిప్యూటీ సీఈవోలుగా, డీఆర్డీవోలుగా ప్రమోషన్లు రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్‌‌‌‌‌‌‌‌కు అర్హులైన అధికారుల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి పంపినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 

సీఎం ఆమోదానికి లిస్ట్​ 

ప్రమోషన్లకు అర్హులైన వారి పేర్లను అధికారులు ఆరు నెలల క్రితం ప్రభుత్వానికి పంపగా, ఆ ఫైల్‌‌‌‌‌‌‌‌ను పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టినట్లు తెలిసింది. దీంతో మరోసారి జాబితాను పంపాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. దీంతో నెల క్రితం పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రమోషన్లకు అర్హులైన ఉద్యోగుల జాబితా పంపించారు. అలాగే, ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వివరాలను కూడా ప్రభుత్వానికి పంపించారు. ప్రమోషన్లపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. ఈ ప్రమోషన్ల లిస్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది.