
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిన కనకరత్నం
- డివిజనల్ ఇంజనీర్ ట్రాన్స్ఫర్ కోసం డబ్బులు డిమాండ్
- ఏసీబీని ఆశ్రయించిన డీఈ
- ఈ ఏడాది మార్చితోనే ముగిసిన ఈఎన్సీ పదవీ కాలం.. ఏడాది పాటు పొడిగించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వీరవల్లి కనకరత్నం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. డివిజనల్ ఇంజనీర్ బదిలీ విషయంలో ఆయన రూ. 50 వేలు డిమాండ్ చేశారు. డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఎర్రమంజిల్‌లోని పంచాయితీరాజ్ శాఖ ఆఫీసుతో పాటు కేపీహెచ్‌బీలోని ఆయన నివాసంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
తర్వాత కనకరత్నంను నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ఏడాది మార్చితో ముగిసిన పదవీకాలం
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో కనకరత్నం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31న ఆయన పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ఆయన పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది కాలం పొడిగించింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ కావడంతో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్స్ విషయంలో కనకరత్నం అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాండూరు పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్న డివిజనల్ ఇంజనీర్.. వికారాబాద్‌కు బదిలీ కోసం ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆఫీస్‌ను ఆశ్రయించాడు.
ఇందుకుగాను కనకరత్నం రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీంతో డీఈ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు బుధవారం ఎర్రమంజిల్‌లోని కనకరత్నం ఆఫీసులో డబ్బులు ఇచ్చాడు. అప్పటికే నిఘా పెట్టిన డీఎస్పీ శ్రీధర్ టీమ్.. కనకరత్నాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. ఏసీబీ టో ల్‌ఫ్రీ నంబర్ 1064 లేదా 94404 46106 వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ ద్వారా సమాచారం అందించాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.