యువతను రక్షించుకుంటేనే భవిష్యత్తు : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క

యువతను రక్షించుకుంటేనే భవిష్యత్తు : పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ ములుగు, వెలుగు: 'యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిష్యత్తు. ప్రభుత్వంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్‌‌‌‌ చేంజర్‌‌‌‌ పాత్రలో తెలంగాణ కీలక పాత్ర వహించనుంది. 2047 నాటికి మూడు ట్రిలియన్‌‌‌‌ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఎదగనున్నదని' పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. 

ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో శుక్రవారం నిర్వహించిన స్వాతంత్ర్య దిన వేడుకల్లో మంత్రి సీతక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధులను మంత్రి సన్మానించారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఆఫీసర్లకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.

 డీఆర్డీఏ ద్వారా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు 492 సంఘాలకు, రూ.31.50 కోట్ల చెక్కును జిల్లా సమాఖ్య సభ్యులకు మంత్రి అందజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇద్దరు లబ్ధిదారులకు కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు. పదో తరగతి, ఇంటర్ లో టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులకు రూ.10 వేల చొప్పున బహుమానం అందించారు. మెప్మా కింద 148 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.17.36 కోట్ల 36 బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు.

 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. వేడుకల్లో కలెక్టర్ దివాకర, అడిషనల్​ ఎస్పీ సదానందం, డీఎఫ్వో రాహూల్ కిషన్ జాదవ్, అడిషనల్​ కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు తదితరులు  పాల్గొన్నారు.