లక్ష్మీపురం లిఫ్ట్ స్కీంను పున‌రుద్ధరించండి  : మంత్రి సీతక్క

లక్ష్మీపురం లిఫ్ట్ స్కీంను పున‌రుద్ధరించండి  : మంత్రి సీతక్క

ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం ఎత్తిపోత‌ల‌ ప‌థకం పునరుద్ధరణకు అనుమతి మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు.

ఆదివారం జిల్లాలోని దేవాదులలో సీఎం పర్యటన సందర్భంగా సీఎంకు సీతక్క వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గోదావరి నది రైట్ బ్యాంక్ పై కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏర్పాటు చేయాల‌ని, తూపాకులగూడెం, దేవాదుల ప‌రిస‌ర‌ గ్రామాల్లోని చెరువులకు నీరందించేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం పనిచేయకుండా నిలిచిపోయిన లక్ష్మీపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పునరుద్ధరణ, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ వద్ద గోదావరి బ్యాక్ వాటర్‌ను వినియోగిస్తూ కొత్త పథకాన్ని ప్రారంభించాలని సీతక్క ప్రతిపాదించారు. దీని ద్వారా మొత్తం 921 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని సీఎంకు వివరించారు. రూ.22 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికను సీఎంకు అంద‌చేశారు.

లక్ష్మీపురం ఎత్తిపోత‌ల‌ పథకం 2007లో నిర్మాణం పూర్తి అయినప్పటికీ, గోదావరి ప్రవాహ మార్పులు, ఇసుక పేరుకుపోవడం వల్ల ప్రస్తుతం అది నిరూప‌యోగంగా మారిందని, మంత్రి విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలో ఇరిగేష‌న్ శాఖ‌లో స‌మావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామ‌ని సీతక్కకు సీఎం హామీ ఇచ్చారు.  

రైస్ మిల్ ను ప్రారంభించిన మంత్రి

వెంకటాపూర్ (రామప్ప): ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంజాపూర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి నూతనంగా నిర్మించిన రైస్ మిల్ ను మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

నాగులమ్మ జాతరకు ఆహ్వానం 

మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం పరిధిలోని లక్ష్మీనర్సాపూర్​లో నిర్వహించనున్న నాగులమ్మ జాతర సందర్భంగా మంత్రి సీతక్కకు ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణస్వామి ఆహ్వానపత్రిక అందజేశారు. ఆదివారం ములుగు క్యాంప్​ ఆఫీస్​లో బాడిష నవీన్​తో కలిసి ఆయన మంత్రికి ఆహ్వానపత్రిక అందజేసి వేడుకలకు రావలసిందిగా కోరారు.