
ఎల్బీనగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం, గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంటి నిర్మాణదారుడికి పర్మిషన్ ఇచ్చేందుకు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. చంద్రశేఖర్ తొమ్మిది నెలలుగా గౌరెళ్లి గ్రామంలో పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన చింతకాలయల రవి ఇల్లు నిర్మించుకునేందుకు పర్మిషన్ కోసం నాలుగు నెలల క్రితం దరఖాస్తు పెట్టుకున్నాడు.
అప్పటి నుండి పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిన సెక్రెటరీ.. తనకు రూ.25వేలు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని చెప్పాడు. దీంతో విసుగు చెందిన రవి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం చంద్రశేఖర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు .కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు రంగారెడ్డి రేంజ్ DSP సూర్యనారాయణ తెలిపారు.