శ్రమను గుర్తించాలంటున్న పంచాయతీ కార్యదర్శులు

శ్రమను గుర్తించాలంటున్న పంచాయతీ కార్యదర్శులు
  • నిరుడు ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు 
  • 30% సాలరీ పెంచిన ప్రభుత్వం
  • ఏడాదైనా అమలుకాని జీవో
  • రాష్ట్రవ్యాప్తంగా 989 మంది ఎదురుచూపులు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం ఏడాది క్రితం పెంచిన జీతం రావడం లేదు. ఔట్ సోర్సింగ్/
కాంట్రాక్ట్ సిబ్బందికి 30 శాతం సాలరీ పెంచుతూ విడుదల చేసిన జీవో నంబర్ 60 పంచాయతీ రాజ్ శాఖలో అమలుకావడం లేదు. దీంతో పంచాయతీ సెక్రటరీలు పాత జీతంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. మిగతా పంచాయతీ సెక్రటరీలతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారితో పోలిస్తే సగం జీతంతోనే పని చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతోపాటు పాత పంచాయతీల్లో ఖాళీగా ఉన్న సెక్రటరీ పోస్టులను జూనియర్ పంచాయతీ సెక్రటరీలతో భర్తీ చేశారు. వారిలో కొందరు పని ఒత్తిడితో రిజైన్ చేసి వెళ్లగా మరికొందరికి ప్రమోషన్ రావడంతో రెండేళ్ల క్రితం కొన్ని జీపీల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఆ పోస్టులకు కొన్ని జిల్లాల్లో గతంలో పరీక్ష రాసిన వారిని మెరిట్ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో ఔట్ సోర్సిగ్ పద్ధతిలో భర్తీ చేశారు. ఔట్ సోర్సిగ్ పద్ధతిలో పనిచేస్తున్న సెక్రటరీలు రాష్ట్రవ్యాప్తంగా 989 మంది ఉన్నారు.

వీరికి ప్రస్తుతం నెలకు రూ.15 వేల జీతం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు జూన్ 11న విడుదల చేసిన జీవో నంబర్ 60 ప్రకారం.. వారికి అదే ఏడాది జూలై నుంచే రూ.19,500 సాలరీ రావాల్సి ఉంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఇతర ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30% జీతం పెంచి ఇస్తున్నా, ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు ఇవ్వడం లేదు. ఇప్పటికే సర్కార్ ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రామాల్లో డ్యూటీ చేస్తున్నామని, ఇంత చేస్తున్నా రోజువారి వేతనం రూ.500 కూడా పడడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు  ఇప్పటికైనా ఏరియర్స్ తో కలిపి జీతాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.