
మహబూబ్‌నగర్, వెలుగు :కోనోకార్పస్ మొక్కల పువ్వుల ద్వారా శ్వాసకోస సమస్యలు వస్తుండడంతో ప్రభుత్వం వాటిని నిషేధించింది. జిల్లాలో ఎక్కడా నాటవద్దని, నర్సరీల్లోనూ పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికే నాటి ఉంటే పువ్వులు పూయకుండా ఎప్పటికప్పుడు కటింగ్ చేయాలని పంచాయతీలకు సూచించింది. అయినా హరితహారం టార్గెట్ రీచ్ కావాలనే ఉద్దేశంతో కొన్ని జీపీల్లో వీటిని నాటుతున్నారు. కొన్నిగ్రామాల్లో ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ మొక్కలు ఎండిపోయే అవకాశాలు తక్కువగా ఉండడమే కాదు త్వరగా పెరుగుతుండడంతో వీటిని నాటుతున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో జీపీలో 1,500 మొక్కలు..
మహబూబ్‌నగర్ జిల్లాలో 447 గ్రామ పంచాయతీలు ఉండగా లాస్ట్ ఇయర్ కొన్ని జీపీల సర్పంచులు 1000 నుంచి 1,500 కోనోకార్పస్ మొక్కలను విశాఖపట్నం నుంచి తెప్పించుకున్నారు. పాత మున్సిపాలిటీలైన పాలమూరు, కల్వకురి, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్‌లకు 30 వేల మొక్కలు చొప్పున, కొత్త మున్సిపాల్టీలైన అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలకు ఐదు వేల మొక్కల చొప్పన డివైడర్ల మధ్య, పార్కులు, కాలనీల్లో ఈ మొక్కలు నాటారు. ఒక్క మహబూబ్‌నగర్–-జడ్చర్ల మధ్య పది వేల మొక్కలు, మహబూబ్‌నగర్–-భూత్పూర్ మధ్య రెండు వేల మొక్కలు ఉన్నాయి. ఇంకా చాలా మొక్కలు మిగిలిపోగా ఈ యేడు నాటుదామని నర్సరీలలోఉంచారు. వీటి నుంచి సమస్య ఉందని తెలుసుకున్న సర్కారు కోనోకార్పస్ మొక్కలు నాటవద్దని ఈ ఫిబ్రవరిలో ఆర్డర్ ఇచ్చింది. అయినా పట్టించుకోకుండా కొందరు ఆఫీసర్లు ప్రస్తుతం కొనసాగుతున్న హరితహారం కింద నాటిస్తున్నారు. నెల కింద మిడ్జిల్‌లో జడ్చర్ల-కల్వకుర్తి ప్రధాన రహదారి డివైడర్ మధ్య, కొద్ది రోజుల కింద ఇదే మండలం రాణిపేట వద్ద డివైడర్మధ్య ఈ మొక్కలను నాటారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రెండు వారాల కింద మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు.
నిరుడు నాటిన మొక్కలకు పూలు
మున్సిపాలిటీల్లో నిరుడు రెండు ఫీట్లు ఉన్న కోనోకార్పస్మొక్కలను నాటగా ప్రస్తుతం పూలు పూస్తున్నాయి. పూల నుంచి వచ్చే పోలెన్ గ్రెయిన్స్ వల్ల శ్యాసకోస సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఆస్తమా పేషెంట్లకు మరింత ప్రమాదం కావడంతో సర్కారు నెలన్నరకోసారి కొమ్మలను కటింగ్ చేయాలని ఆదేశించింది. కానీ, ఆఫీసర్లు, పంచాయతీ పాలకులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఐదు లక్షల మొక్కలు నాటగా.. ఒక్క చెట్టు కొమ్మ కటింగ్ చేయడానికి కూలీలు రూ.100 వరకు తీసుకుంటున్నారు. ఐదు లక్షల మొక్కలకు ఒకసారి కటింగ్ చేయాలంటే దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు భరించలేకనే మున్సిపాలిటీలు, జీపీలు కొమ్మలు కత్తరించే పనులు చేయించడం లేదని తెలిసింది.
అగ్వకు కొని.. రెండింతల బిల్లులు డ్రా
రెండు ఫీట్లు ఉన్న కోనోకార్పస్ మొక్క ఒకటి మార్కెట్లో రూ.60 నుంచి రూ.70 వరకు దొరుకుతుంది. కానీ, చాలా మున్సిపాల్టీల్లో అధికార పార్టీ లీడర్లు కొందరు ఈ మొక్కలు సప్లై చేసే టెండర్‌ను దక్కించుకున్నారు. వీరు కొందరు మున్సిపల్ లీడర్లు, ఆఫీసర్లతో కుమ్మక్కై ఒక్కో మొక్కను రూ.120 నుంచి రూ.150కి కొన్నట్లు బిల్లులు డ్రా చేసుకున్నారు. వీటిని గవర్నమెంట్ నర్సరీల్లో పెంచొద్దని బ్యాన్ ఉన్నా ప్రైవేట్ నర్సరీల్లో మాత్రం పెంచుతున్నారు. అది అతి తక్కువ ధరకే గంపగుత్తగా వీటిని తెచ్చుకుంటున్నారు.
ఎంపీడీవో చెబితే నాటినం
రాణిపేట నర్సరీలో కోనోకార్పస్ మొక్కలు లేవు. ఇటీవల అడిషనల్ కలెక్టర్ ఇక్కడ పర్యటించిన టైంలో డివైడర్ మధ్యలో మొక్కలు నాటించాలని ఎంపీడీవో చెప్పారు. మా నర్సరీలో మొక్కలు లేకుంటే మిడ్జిల్ నర్సరీలో ఉన్న మొక్కలు తెచ్చి పెట్టినం. - సుదర్శన్, పంచాయతీ సెక్రటరీ, రాణిపేట
పుప్పొడి రేణువులతోనే సమస్య
కోనోకార్పస్ పువ్వుల పుప్పొడి రేణువుల వల్ల శ్యాసకోస వ్యాధులు వస్తాయని ఇటీవల అధ్యయనంలో తేలింది. దీని వేర్లు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పైపులు, ఎలక్ట్రికల్ వైర్లలోకి కూడా చొచ్చుకుపోతాయి. అందుకే ప్రభుత్వం వీటిని బ్యాన్ చేసింది. గ్రామాల్లో వీటిని నాటకపోవడం మంచిది.
- సదాశివయ్య, బొటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, జడ్చర్ల