- ఉమ్మడి జిల్లాలో 31 మంది మహిళలకు దక్కిన మద్యం షాపులు
- నిజామాబాద్‌లో ఒకే మహిళకు రెండు దుకాణాలు
- రెండు సిండికేట్ గ్రూప్‌లకు చెరో దుకాణం
- నిజామాబాద్‌లో 102, కామారెడ్డిలో 49 షాపులకు లాటరీ.
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : మద్యం దుకాణాల కేటాయింపు కోసం నిర్వహించిన లాటరీలో ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ దుకాణాలు దక్కుతాయోనని ఆతృతగా ఎదురుచూశారు. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులకు సోమవారం కలెక్టర్లు వినయ్‌కృష్ణారెడ్డి, ఆశిష్ సంగ్వాన్ లక్కీ డ్రాలు తీశారు. నిజామాబాద్‌లో 3,759 దరఖాస్తులు, కామారెడ్డిలో 1502 దరఖాస్తులు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ పట్టణ శివారులోని భారతీ గార్డెన్లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు లాటరీలు తీసి దుకాణాలు కేటాయించారు. ఇందుకోసం దరఖాస్తులుదారులు లగ్జరీ కార్లలో రాగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. లాటరీ కేటాయింపుల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.
మహిళలకు లక్కు..
102 వైన్స్ షాపుల్లో అప్లికేషన్లు పెట్టుకున్న మహిళల్లో 19 మందిని అదృష్టం వరించింది. నగరానికి చెందిన ఉమాదేవికి పోతంగల్, ఎడపల్లి దుకాణాలు దక్కాయి. వైన్స్ షాప్ కోసం అప్లికేషన్ పెట్టుకొని తల్లి మరణంతో లాటరీ జరుగుతున్న హాల్ నుంచి వెళ్లిపోయిన మరో మహిళకు లెక్కు దక్కింది. తనకు బదులుగా ఆమె మరొకరికి కాన్సెంట్ ఇచ్చి వెళ్లగా లాటరీలో సిటీలోని ఒక షాప్ ఆమె సొంతమైంది. ఎర్గెట్ల షాప్ కోసం మొత్తం 96 అప్లికేషన్లు రాగా గత రెండేండ్ల నుంచి వైన్స్ నడుపుతున్న శ్రీధర్‌రెడ్డిని మరోసారి లక్కు వరించి లాటరీలో అదే దుకాణం దక్కింది. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత శరత్‌కు వైన్స్ దక్కాయి.
సిండికేట్లు నారాజ్
రూ.3 లక్షలతో ఒంటరిగా వైన్స్ అప్లికేషన్ వేయడం భారంగా భావించిన యువకులు జిల్లాలో రెండు సిండికేట్ గ్రూప్‌లుగా ఏర్పడి రూ.90 లక్షలతో 30 దరఖాస్తులు వేయగా చెరో షాప్ దక్కి బయటపడ్డారు. లిక్కర్ షాపుల అప్లికేషన్లతో సర్కార్‌కు ఈసారి రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లక్కీ డ్రా తీశారు. 49 షాపులకు మొత్తం 1502 అప్లికేషన్లు వచ్చాయి. షాపుల నంబర్ల ప్రకారం అప్లయ్ చేసుకున్న వ్యక్తుల సమక్షంలో ఆయా షాపులకు డ్రా నిర్వహించారు. డిసెంబర్ 1 నుంచి షాపులను కేటాయిస్తారు. 49 షాపుల్లో 12 షాపులు మహిళలకు దక్కాయి. ఇందులో ఇద్దరు ఏపీకి చెందిన వారు ఉన్నారు. కలెక్టర్‌తో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.హనుమంతరావు అధికారులు పాల్గొన్నారు.
