హసన్ పర్తి, వెలుగు: గంజాయి మత్తులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని హనుమకొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 4 బైక్ లు, 3 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సోమవారం హసన్ పర్తి పీఎస్ లో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. కాజీపేట మండలం బాపూజీ నగర్ చెందిన కలుగుల సాయి చందు, రెడ్లమ్ రాకేశ్, మడికొండకు చెందిన గంపల సాయి తేజ, వైఎస్ఆర్ నగర్ చెందిన ముద్దంగుల అనిల్ ఫ్రెండ్స్. వీరు ముఠాగా ఏర్పడి కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు.
వీరు గంజాయి తాగుతూ వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో చోరీలు చేస్తుంటారు. కాజీపేట, మడికొండ, కేయూ, ధర్మసాగర్ ఏరియాల్లో పార్కింగ్ చేసిన, వైన్స్ షాపుల వద్ద బైక్ లను ఎత్తుకెళ్లారు. ఇప్పటికే అనిల్ పై15 చోరీ కేసులు ఉన్నాయి. సోమవారం మండలంలోని సీతంపేట శివారులో హసన్ పర్తి పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. నలుగురూ అనుమాస్పదంగా బైక్ పై వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. గంజాయి తాగి చోరీలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపామని ఏసీపీ తెలిపారు. క్రైమ్ కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్, వెంకట్ స్వామిని అభినందించి రివార్డ్ అందజేశారు.సీఐ చేరాలు, ఎస్ఐలు దేవేందర్, రవి ఉన్నారు.
14 కేజీల గంజాయితో పట్టుబడిన ఇద్దరు
ఏటూరునాగారం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏటూరునాగారం అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. సోమవారం మీడియాకు వివరాలు తెలిపారు. ఆదివారం వెంకటాపురం పీఎస్ పరిధిలోని నూగూరు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మూడు బైక్‌లపై ఆరుగురు వ్యక్తులు ఏటూరునాగారం వైపు అనుమానాస్పదంగా వెళ్తుండగా, పోలీసులు ఆపేందుకు యత్నించినా వెళ్లడంతో వెంబడించారు. బైక్ లను వదిలేసి పారిపోతుండగా ఇద్దరిని పట్టుకుని విచారించగా ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా మన్నెంకొండ మండలానికి చెందిన తాటి ఇర్మా, మడకం రాయియెర్ర గా గుర్తించారు.
వారి వద్ద బ్యాగులను చెక్ చేయగా 14కిలోల గంజాయి దొరికింది. పారిపోయిన నిందితుల్లో కూరం దుర్గయ్య, సోడి జోగ, చందు, మరోవ్యక్తి ఉన్నారు. రెండేళ్లుగా గంజాయి తరలిస్తున్నట్టు చెప్పారు. తక్కువ ధరకు గంజాయి కొని వరంగల్ లో రూ.10వేల చొప్పున అమ్మేందుకు వస్తున్నట్టు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.7లక్షలు ఉంటుందని అడిషనల్ ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐ రమేశ్, ఎస్ఐ తిరుపతి రావు ఉన్నారు.
