ప్రతి ఓటర్ను కలవాలి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి : మంత్రి వివేక్

ప్రతి ఓటర్ను కలవాలి  గెలుపు కోసం కష్టపడి పనిచేయాలి : మంత్రి వివేక్
  • జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​దే విజయం

  • బూత్ లెవల్ కార్యకర్తలకు దిశా నిర్దేశం

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్​లోని ఓటర్లందరినీ ఇన్​చార్జీలు కలవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు లభిస్తున్నదని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారన్నారు. అలాంటి వారిని పార్టీ నేతలు, కార్యకర్తలు కలుపుకొని క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాలన్నారు. సోమవారం షేక్​పేట డివిజన్​లోని 70‌‌ మంది బూత్ స్థాయి కార్యకర్తలతో మంత్రి వివేక్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘‘బూత్ లెవల్​లో పర్యటిస్తూ కాంగ్రెస్​కు మద్దతు కూడగట్టాలి. ప్రతి ఓటర్​నూ కలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించాలి. ఓటర్ మ్యాపింగ్​పైనా దృష్టి పెట్టాలి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్​ను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంతో అభివృద్ధి చేసింది. దండిగా నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి’’ అని వివేక్ సూచించారు. 

ఎర్రగడ్డలో మంత్రి జూపల్లి ప్రచారం

ఎర్రగడ్డలో మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కళ్యాణ్​నగర్, హైమావతినగర్​లో ఉదయం వాకర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. కేసీఆర్ అప్పులకుప్పగా మార్చారు. గ‌తంలో ఏ సీఎం చేయ‌ని అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఇచ్చిన హామీల‌ను నెరవేరుస్తున్నాం’’అని జూపల్లి తెలిపారు. తర్వాత స్టేట్ డెయిరీ డెవ‌ల‌ప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నేతలతో క‌లిసి పాద‌యాత్రలో పాల్గొన్నారు.